ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కావాలి
బళ్లారి అర్బన్: అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడిన ఉత్తర కర్ణాటకలోని 13 జిల్లాలను కలిపి ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత జనగణ సమాఖ్య సంస్థాపక జాతీయ అధ్యక్షుడు ఎన్.గంగిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముండ్లూరు రామప్ప మీటింగ్ హాల్‌లో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకలోని 6 జిల్లాలు, ముంబై కర్ణాటకలోని 7 జిల్లాలను కలిపి మొత్తం 13 జిల్లాలతో కొత్త రాష్ట్రాన్ని ప్రకటిస్తేనే ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి నోచుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల అభివృద్ధినే ఇప్పటి వరకు వచ్చిన పాలకులు చేశారన్నారు. ఇప్పటికై నా ప్రత్యేక రాష్టాన్ని ప్రకటించాలని ఒత్తిడి చేశారు. అలాగే 4 జిల్లాలతో కూడిన కేఎంఎఫ్ కర్ణాటక సహకార పాల ఉత్పత్తిదారుల పాలక మండలి మొదటి నుంచి బళ్లారిలో ఉంది. ప్రస్తుతం కొందరు రాజకీయ నేతలు తమ పబ్బం గడుపుకోడానికి విజయనగర జిల్లాకు మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకు ముందు బీ.నాగేంద్ర బళ్లారి ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న వేళ కొళగల్లు గ్రామం దగ్గర మెగా డైరీ ఏర్పాటు చేయాలని భూమిని మంజూరు చేశారు. అయితే ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి పనులు చేపట్టలేదన్నారు. తక్షణమే అక్కడ కేటాయించిన 20 ఎకరాల్లో మెగా డైరీని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


