లబ్ధిదారులకు ప్రత్యామ్నాయం చూపండి
హొసపేటె: నగరంలోని హంపీ రహదారిలో ఉన్న అనంతశయనగుడి వద్ద చేపడుతున్న రైల్వే ఫ్‌లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఇళ్లు కోల్పోయిన వారికి నగరంలో స్థలాలను కేటాయించాలని ఎమ్మెల్యే గవియప్ప సంబంధ అధికారులకు సూచించారు. శనివారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అధికారులు, అనంతశయన గుడి ప్రజలతో సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫ్‌లైఓవర్ నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయే లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా తగిన ప్రదేశంలో తగిన కొలతల ఇంటిని అందించాలని నిర్ణయించామన్నారు. స్థలాన్ని సిద్ధం చేయమని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వానికి గరిష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతశయనగుడి గ్రామస్తుల రాకపోకలకు వీలుగా సప్తాంజనేయ ఆలయ సమీపంలో ఒక చిన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధిత అధికారులు, రైల్వే మంత్రితో చర్చించి ఆమోదం పొందుతామని తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ వివేక్, తహసీల్దార్ శృతి, డీఎస్పీ మంజునాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


