మండ్య: మండ్య జిల్లాలో పేరుమోసిన ఐతిహాసిక మేలుకోటె శ్రీ చెలువనారాయణ స్వామివారి వైరముడి ఉత్సవం సోమవారం రాత్రి వేలాది మంది భక్తుల సమక్షంలో నేత్రపర్వంగా జరిగింది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని కీరిటం అని కీర్తించే వైరముడి కిరీటాన్ని చెలువనారాయణ స్వామి తల మీద అలంకరించారు. జిల్లా కలెక్టరు కుమార్.. పూజలు చేసి అంకురార్పణ చేశారు. గరుడ ఊరేగింపు, మంగళహారతి తరువాత రాత్రి సుమారు 8.08 గంటలకు వైరముడి ఉత్సవం ప్రారంభమైంది. తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఏకధాటిగా కొనసాగింది. దేవాలయం ఎడమ వైపున ఉన్న మండపంలో స్వామికి హారతినిచ్చి చతుర్ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. భక్తజనం పోటెత్తడంతో వేడుక నెమ్మదిగా కొనసాగింది. అంతకుముందు గర్భగుడిలో జిల్లా ప్రముఖులు వైరముడికి విశేష పూజలు చేయించి అర్చకులకు అందజేశారు. ఆలయ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటైంది.
మేలుకోటెలో భక్తసంద్రం
వైరముడి వైభవోపేతం


