సమస్యల సాధనకు 21, 22 తేదీల్లో అహోరాత్రి ధర్నా
బళ్లారిఅర్బన్: బెంగళూరులో ఈ నెల 21, 22 తేదీల్లో అలెమారి, అరె అలెమారి సామాజిక వర్గాల వివిధ సమస్యల పరిష్కారం కోసం రాత్రింబగళ్లు ఆందోళన చేపడుతున్నట్లు ఆ సంఘాల సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కే.రవీంద్ర శెట్టి తెలిపారు. గొల్లర సంఘం కార్యాలయంలో గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీసీ 1లో చేరిన సదరు వర్గాల్లోని 46 కులాలను కలుపుకొని ఉన్న కుటుంబాలు, ఎన్నో ఏళ్ల నుంచి వీధుల్లో గుడారాలను వేసుకొని దుర్భరమైన జీవితం గడుపుతున్నారన్నారు. జీవనోపాధి కోసం గ్రామాల్లో పాత్రలు, సామానుల వ్యాపారం, పశువులు, మేకల పెంపకం, వలలు నిర్మించడం ఇలా వివిధ వృత్తులను ఆధారంగా బతుకు సాగిస్తూ రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా చాలా వెనుకబడి ఉన్నారన్నారు. ఈ వర్గాలకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించి సమాజంలో ప్రధాన స్రవంతిలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా సమాజ బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖులు వెంకటేష్ యాదవ్, కేఈబీ బసరెడ్డి, కే.శ్యామలయాదవ్, బైలు పత్తార్ పరశురామ, బైలు పత్తార్ రేణుక తదితరులు పాల్గొన్నారు.


