తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు
రాయచూరు రూరల్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తనీయ వద్దని, దాని నియంత్రణకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ అధికారులకు సూచించారు. శనివారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలం ప్రారంభమైందన్నారు. నాలుగు నెలల పాటు ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. నీటి సౌకర్యాలు లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు యజమానులతో చర్చించాలన్నారు. ఎక్కడా కూడా ప్రజలు నీటితో ఇబ్బందులు పడుతున్నారనే విషయం తన దృష్టికి రాకుండా చూడాలన్నారు. సింధనూరు, మస్కి, మాన్వి తాలూకాల్లో అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టం అంచనాలను తయారు చేసి పరిహారం అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను నీటితో నింపాలన్నారు. జల్ జీవన్ మిషన్, జలధారె పథకాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు బసన గౌడ, శివరాజ్ పాటిల్, హంపయ్య నాయక్, హంపనగౌడ బాదర్లి, విధాన పరిషత్ సభ్యులు వసంత కుమార్, బసనగౌడ, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే, ఎస్పీ పుట్టమాదయ్య, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున, ఉపాధ్యక్షుడు బషీర్‌లున్నారు.
అధికారులకు మంత్రి శరణ ప్రకాష్ సూచన
తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు


