మఠంలో రూ.300 కోట్లు ఉన్నాయని..
● దోపిడీకి యత్నించిన ముఠా.. అరెస్టు
శివమొగ్గ: తీర్థహళ్లి తాలూకాలోని మహిషిలోని ఉత్తరాది మఠంలో జరిగిన దోపిడీ ఘటనలో 13 మంది నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జీకే మిథున్ కుమార్ తెలిపారు. డీఏఆర్ సభాంగణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిషి మఠంలో సుమారు రూ.300 కోట్ల నగదు ఉన్నట్లు అనుమానించిన దుండగులు ఈనెల 5న అర్థరాత్రి మఠంలోకి చొరబడ్డారు. పలుచోట్ల గాలించగా అంత మొత్తం నగదు ఏదీ దొరకలేదు. చివరకు రూ. 50 వేల నగదుతో పరారయ్యారు. మఠంలోని సీసీ కెమెరాలు, డీవీఆర్, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను కూడా ఎత్తుకెళ్లారు. పోలీసులు సురేష్ అలియాస్ నేరలె సురేష్, సతీష్ అలియాస్ సత్యనారాయణ, పృథ్విరాజ్, సిరి అలియాస్ శ్రీకాంత్, అభిలాష్ అలియాస్ అభి, రాకేష్, భరత్ అలియాస్ చిట్టి, పవన్ అలియాస్ గిడ్డ పవన్, రమేష్ అలియాస్ నవీన్, నవీన్ కుమార్ అలియాస్ డైమండ్ నవీన్, దర్శన్, కరిబసప్ప, శీనాను పట్టుకున్నారు. వీరంతా శికారిపుర, ఆనందపుర, హొసనగర నివాసులు. కేసులో మొత్తం 21 మంది నిందితులున్నట్లు తెలిసింది. దోపిడీకి వాడిన టెంపో ట్రాక్స్ వాహనం, మహేంద్ర స్కార్పియో కారులను స్వాధీనపరచుకున్నారు.
సాకప్ప సాకు.. జేడీఎస్ ధర్నా
శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ జేడీఎస్ సాకప్ప సాకు కాంగ్రెస్ ప్రభుత్వం అనే అభియానను కేంద్ర మంత్రి, జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.డీ.కుమారస్వామి ప్రారంభించారు. శనివారం నగరంలోని ఫ్రీడం పార్కులో యువ జనతాదళ రాష్ట్రాధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి నేతృత్వంలో ఆందోళనను నిర్వహించారు. వందలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దుష్ట పరిపాలన, అవినీతితో పాటుగా ఐదు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో సంపదను దోచుకొంటున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్నట్లు నిఖిల్ చెప్పారు.
ముట్టడికి యత్నం
నిఖిల్, నాయకులు, కార్యకర్తలు విధానసౌధ ముట్టడికని బయలుదేరగా, పోలీసులు అడ్డుకున్నారు. నిఖిల్‌తో ఎమ్మెల్యేలు, నాయకులను అదుపులోకి తీసుకొని తరువాత విడుదల చేశారు. బీజేపీ జనాక్రోశ యాత్రతో రాష్ట్రంలో జిల్లాల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ కూడా ధర్నాల బాట పట్టింది. రెండు పార్టీలు మిత్రపక్షాలు అయినప్పటికీ వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం.
క్యాంటర్‌ను ఢీకొన్న బస్సు
యశవంతపుర: క్యాంటర్, కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయడిన ఘటన రామనగర జిల్లా మాగడి తాలూకా సోలూరు వద్ద శనివారం జరిగింది. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్యాంటర్ వాహనం పంచరై మంగళూరు–బెంగళూరు హైవేలో నిలిచి ఉండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. డ్రైవర్ ఇరుక్కుపోయాడు. స్థానికులు, పోలీసులు జేసీబీతో రెండు వాహనాలను వేరు చేసి బాధితులను నెలమంగల ఆస్పత్రికి తరలించారు.
మరిది కోసం.. భర్త హతం
మైసూరు: చెల్లెలి భర్తతో అనైతిక సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను భార్య, ప్రియునితో కలిసి హత్య చేసిన ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా తెరకణాంబి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మూడగూరు గ్రామానికి చెందిన సిద్దేశ్ హత్యకు గురైన వ్యక్తి. సిద్దేశ్, సవిత దంపతులు కాగా సవితకు చెల్లెలి భర్తతో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ ఆనందానికి సిద్దేశ్ అడ్డుగా ఉన్నాడని భావించారు. 3వ తేదీన అర్ధరాత్రి ఇంటిలో సిద్దేశ్ గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రియుడు సిద్దరాజుతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించింది. కాలిన గాయాలతో సిద్దేశ్‌ను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు. అగ్ని ప్రమాదంలో గాయాలైనట్లు భార్య అందరికీ చెప్పింది. కానీ సిద్దేశ్ తల్లి మహదేవమ్మ కోడలిపై అనుమానంతో ఫిర్యాదు మేరకు తెరకణాంబి పోలీసులు విచారణ చేశారు. సవిత, సిద్దరాజు నేరకృత్యం తెలిసి అరెస్టు చేసి జైలు తరలించారు.
మఠంలో రూ.300 కోట్లు ఉన్నాయని..
మఠంలో రూ.300 కోట్లు ఉన్నాయని..


