బీజేపీ నేతలు పశ్చాత్తాప యాత్ర చేపట్టాలి
హుబ్లీ: ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ జనాక్రోశయాత్ర చేయడానికి బీజేపీకి నైతిక హక్కు లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ సలీం అహ్మద్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో గత 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ కర్ణాటక ప్రజల పట్ల చాలా అన్యాయం, పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు. అందువల్ల వారు పశ్చాత్తాప యాత్ర చేపట్టడం మంచిదని ఆయన అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర తక్కువగా ఉన్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినా ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు.
బీజేపీపైనే అంతటా జనాక్రోశం
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అంతటా జనాక్రోశం వ్యక్తమవుతోందన్నారు. ఎగువ కృష్ణ తదితర నీటి పారుదల ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం, నగర, స్థానిక సంస్థలకు ప్రత్యేక నిధులు తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎం సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారన్నారు. ఇందులో ఒకే ఒక డిమాండ్‌ను కూడా ప్రధాని నెరవేర్చలేదన్నారు. మహదాయి, మేకెదాటు పథకాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. కేంద్రం ఎంతో అన్యాయం చేసినా రాష్ట్రానికి చెందిన 5 మంది కేంద్ర మంత్రులు, 18 మంది బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌పై జనాక్రోశ యాత్ర చేపట్టడం హాస్యాస్పదం అన్నారు.
కాంగ్రెస్‌తోనే తండ్రీకొడుకులకు అందలం
కాంగ్రెస్ కావాలంటూ హెచ్‌డీ దేవేగౌడ ప్రధాని, ఆయన కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఇప్పుడేమో దారి తప్పిన పిల్లలు నిఖిల్ కుమారస్వామి, బీవై విజయేంద్ర కాంగ్రెస్ చాలు అంటూ ఆందోళన చేపట్టడం దురదృష్టకరం అంటున్నారు. చిన్నచితకా విషయాలకు బీజేపీ గ్యారెంటీ పథకాలపై విమర్శించడం సరికాదన్నారు. బీజేపీకి ధైర్యం ఉంటే గ్యారెంటీ పథకాలను ఆపమని చెప్పాలన్నారు. ఈ పథకాలకు రూ.52 వేల కోట్లు సేకరణకు మేం స్వల్పంగా పన్నులు విధించాం. అయితే కేంద్ర సర్కారు గత 11 ఏళ్ల నుంచి సామాన్య ప్రజలను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. సమావేశంలో ఎమ్మెల్యే కోనరెడ్డి, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి సదానంద డంగనవర, భాస్కర్ శరణప్ప కోటగి, అనిల్‌కుమార్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ సలీం అహ్మద్


