ఆకట్టుకున్న పల్లకీల ఊరేగింపు
కోలారు : నగరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖ, సాంఘీక సంక్షేమ శాఖ, వివిధ దళిత సంఘాల ఆధ్వర్వంలో అంబేడ్కర్ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు జిలా ఇంఛార్జి మంత్రి భైరతి సురేష్ నగరంలోని బంగారుపేటె సర్కిల్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మాలార్పణ చేసిన అనంతరం అంబేడ్కర్ పల్లకీల ఊరేగింపును ప్రారంభించారు. నగరంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు బయలుదేరింది. డూం లైట్ సర్కిల్, ఎంజీ రోడ్డు, బస్టాండు సర్కిల్, మెక్కె సర్కిల్ మీదుగా టి.చెన్నయ్య రంగమందిరానికి చేరుకుంది. అక్కడ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 50కి పైగా పల్లకీలు ఊరేగింపులో సాగాయి. ఊరేగింపులో కళా బృందాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఊరేగింపును ప్రారంభించిన అనంతరం మంత్రి భైరతి సురేష్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ మహా మానవతా వాది అనడంలో తప్పు లేదన్నారు. అణగారిన వర్గాల వారి అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారన్నారు. సామాజిక తారతమ్యాన్ని రూపుమాపడానికి పాటు పడ్డారన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన నిరంతర పోరాటం సాగించారన్నారు. దళిత సముదాయానికి న్యాయం చేయడం, వారిని సమాజంలో ఉన్నత స్థానానికి తీసుకు రావడం ఆయన ధ్యేయం అన్నారు. రాజ్యాంగ పరిధిలో జీవిస్తున్న మనం అందరం ఆయన ఆదర్శ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. కోలారు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ ఎంఎల్ అనిల్‌కుమార్, మాజీ ఎంపీ ఎస్ మునిస్వామి, కలెక్టర్ ఎంఆర్ రవి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.


