
శరావతిపై 2 వేల మెగావాట్ల ప్రాజెక్టు!
బనశంకరి: శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలోని అంబుతీర్థ వద్ద జన్మించే శరావతి నది పశ్చిమ కనుమల్లో అత్యంత ప్రకృతి రమణీయ ప్రదేశంగా పేరుపొందింది. పర్యావరణపరంగా వైవిధ్యభరితమైన ప్రాంతాల గుండా దాదాపు 130 కిలోమీటర్లు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది కర్ణాటకలో విద్యుత్ ఉత్పత్తికి కూడా ప్రధాన వనరు. ఈ నదీజలాలపైనే... శరావతి జనరేటింగ్ స్టేషన్ (1,035 మెగావాట్లు), మహాత్మగాంధీ జలవిద్యుత్ కేంద్రం (139 మెగావాట్ల), లింగనమక్కి డ్యామ్ పవర్‌హౌస్ (55 మెగావాట్లు) విద్యుదుత్పాదనలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.
విద్యుత్ వెలుగుల శరావతి
దశాబ్దాలుగా ఈ కేంద్రాలు, థర్మల్ పవర్ యూనిట్లు కంటే తక్కువ ఖర్చుతో కర్ణాటకకు మిలియన్ల కొద్దీ యూనిట్ల విద్యుత్‌ను అందిస్తున్నాయి. కానీ ఈ నది వెంబడి ఉన్న ప్రాజెక్టులు తరచుగా పర్యావరణవేత్తలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమౌతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీసీఎల్) శరావతి లోయ పంప్‌డ్ స్టోరేజ్ జల విద్యుదుత్పత్తి పథకాలకు ప్రణాళికవేస్తోంది. శివమొగ్గ– ఉత్తర కన్నడ జిల్లా పరిధిలో ఈ ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. లోయలో ఉన్న రెండు జలాశయాలను ఉపయోగించి మరో 2 వేల మెగావాట్లను ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్టు ప్లాన్ చేశారు. రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు అవుతుంది. దీని వల్ల మరింత విద్యుదుత్పత్తి జరిగి పరిశ్రమలకు, ఇళ్లకు వెలుగులు నింపుతుంది. అలాగే వేలాది ఉద్యోగ, ఉపాధి అవకావాలను సృష్టిస్తుందని విద్యుత్ అధికారులు తెలిపారు.
మరింత ఉప్పునీటి సమస్య
ఇది పర్యావరణ చట్టాల ఉల్లంఘన అని జీవవైవిధ్య మండలి మాజీ అధ్యక్షుడు అనంతహెగ్డే చెబుతున్నారు. వేలాది చెట్లను కొట్టివేస్తున్నారు. మామూలుగా శరావతి నదిలో 14 కిలోమీటర్ల వరకు సముద్రం నుంచి ఉప్పు నీరు చొరబడుతుంది. పంప్డ్ స్టోరేజ్ పథకం అమలైతే కోట్ల లీటర్ల నీటిని పైన ఉన్న రిజర్వాయరుకు తరలిస్తారు. గేరుసొప్పు జలాశయం నుంచి నదిలోకి ప్రవహించే నీటి ప్రమాణం తగ్గుతుంది. దీంతో ఉప్పు నీరు మరితం దూరం వరకు చొరబడి నది, అందులోని జలచరాల సంతతి ఆహారం దొరక్క నశిస్తుందని చెప్పారు.
మరింత విద్యుదుత్పత్తి, ఉపాధి అవకాశాలు
ప్రకృతికి నష్టమని పర్యావరణవేత్తల
ఆందోళనలు
అడకత్తెరలో చిక్కిన భారీ పథకం
భూమి కుంగే ప్రమాదం
శరావతి నది పరిసరాలు సున్నితమైన భూ ప్రదేశాలని, ఇక్కడ భారీ యంత్రాలతో సొరంగాలు, రిజర్వాయర్లను తవ్వితే భూమిపొరలు సడలిపోయి కుంగిపొయే ప్రమాదం సంభవించవచ్చని చెప్పారు. తవ్వకాల కోసం జరిపే పేలుళ్ల వల్ల వన్యజీవులు వలస వెళ్లవచ్చు. అంతేగాక లింగనమక్కితో పాటు ప్రముఖ జలాశయాలకు ఇది ప్రమాదం కావచ్చుననే భయం ఉందని సంరక్షణా జీవశాస్త్రవేత్త కేశవ కోర్క అన్నారు. గేరుసొప్ప నుంచి భూమి లోపల సొరంగం తవ్వడానికి కనీసం 1500 కార్మికులు 5– 6 ఏళ్లు పనులు చేస్తారు. నీటి వనరులు, అడవి కలుషితమౌతుందని పేర్కొన్నారు.
రూ.10 వేల కోట్ల పథకంతో నష్టాలా?
మరోవైపు ఇది పర్యావరణానికి మంచిది కాదని మేధావులు, పర్యావరణ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. రూ.10 వేల కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల వేలాదిగా చెట్లను కొట్టివేస్తారు, అడవి, నది ముప్పులో పడతాయన్నారు. విస్తృతమైన జంతువులు, వృక్ష జాతుల జీవ వైవిధ్యంతో కూడిన అభయారణ్యాన్ని సంరక్షించాల్సిన ప్రభుత్వమే ఉల్లంఘించి పథకం అమలుకు సిద్ధమైందని పర్యావరణవాదులు ఆరోపిస్తున్నారు. ఈ విద్యుత్ పథకం వద్దని అటవీశాఖ అధికారులు సర్కారుకు నివేదిక అందజేసినప్పటికీ సర్కారు పక్కన పెట్టి అనుమతి ఇచ్చిందని ఆరోపణలున్నాయి.

శరావతిపై 2 వేల మెగావాట్ల ప్రాజెక్టు!