హత్య కేసులో చాలెంజింగ్ స్టార్ దర్శన్, నటి పవిత్ర గౌడ అరెస్టు
మరో 11 మంది నిర్బంధం
పవిత్రకు అసభ్య మెసేజ్‌లు పంపుతున్నాడని చిత్రదుర్గవాసి హతం
ఈ నెల 8న బెంగళూరులో ఘటన సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం
సినిమాలో కంటే నిజజీవితంలో జరిగే సంఘటనలే మరింత నాటకీయంగా ఉంటాయని మళ్లీ రుజువైంది. షూటింగ్‌లో ఉండగా ప్రముఖ నటున్ని పోలీసులు అరెస్టు చేయడం, తరువాత ఆయన సన్నిహితురాలిని కూడా నిర్బంధించడం సినీ ఫక్కీలో జరిగిపోయింది. గతంలో కుటుంబ కలహాలతో వార్తల్లోకెక్కిన దర్శన్ ఇప్పుడు హత్య కేసులో నిందితుడు అయ్యాడు.
దొడ్డబళ్లాపురం: ఓ యువకుని హత్యకు సంబంధించి ప్రముఖ హీరో, చాలెంజింగ్ స్టార్ దర్శన్, మరో నటి, ఆయన సన్నిహితురాలు పవిత్రగౌడతో పాటు 10 మంది బౌన్సర్లను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రేణుకాస్వామి అనే యువకుని హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉందని కామాక్షిపాళ్య పోలీసులు మంగళవారం మైసూరులో దర్శన్‌ను అరెస్టు చేసి రాజధానికి తరలించారు. దర్శన్ అరెస్టు విషయం తెలుసుకున్న అభిమానులు కామాక్షిపాళ్య పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బాస్.. బాస్.. ది బాస్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్ నగరలోని దర్శన్ నివాసంతో పాటు పలుచోట్ల పోలీసులు భద్రతను పెంచారు.
పవిత్రపై అసభ్య మెసేజ్‌లు...
పోలీసు కమిషనర్ బి.దయానంద చెప్పిన ప్రకారం... సోషల్ మీడియాలో పవిత్రగౌడ ఫోటోలపై రేణుకాస్వామి తరచూ అసభ్యంగా మెసేజ్‌లు పెట్టేవాడు. ఆమె దర్శన్‌కు చెప్పడంతో రేణుకాస్వామిని గుర్తించి పట్టుకుని జూన్ 8న రాత్రి కామాక్షిపాళ్య వద్ద ఉన్న దర్శన్ అనుచరుడు వినయ్‌కు చెందిన షెడ్‌లోకి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. అప్పుడు దర్శన్ అక్కడే ఉన్నారు. తరువాత మృతదేహాన్ని దగ్గరలో కాలువలోకి విసిరేశారు. జూన్ 9న సుమ్మనహళ్లి వద్ద ఉన్న రాజకాలువలో రేణుకాస్వామి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని రేణుకాస్వామిదిగా గుర్తించి విచారణ చేపట్టారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు డబ్బు గొడవలతో ఈ హత్య చేసినట్టు చెప్పుకుని పోలీసుల వద్ద లొంగిపోయారు. అయితే వారి వాంగ్మూలాలలో తేడా గమనించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించగా దర్శన్ పేరు చెప్పారు.
చిత్రదుర్గ నుంచి ఇలా రప్పించారు
చిత్రదుర్గలో కేఈబీ రిటైర్డ్ ఇంజినీర్ కాశినాథ్ శివనగౌడ, రత్నప్రభ దంపతుల కుమారుడు రేణుకాస్వామి. గత ఏడాది సహనా అనే యువతితో పెళ్లయింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణీ. అతడు కూడా దర్శన్‌కు అభిమాని. ఈ నేపథ్యంలో రేణుకాస్వామిని మాయమాటలతో బెంగళూరులో నిందితుల వద్దకు తీసుకువచ్చిన చిత్రదుర్గ దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రను కూడా పోలీసులు అరెస్టు చేసారు. గత శనివారం దర్శన్ పిలుస్తున్నాడని చెప్పి రేణుకాస్వామిని రాఘవేంద్ర బెంగళూరుకు తీసుకువెళ్లాడు. శనివారం మధ్యాహ్నం తల్లితండ్రులకు ఫోన్ చేసిన రేణుకాస్వామి తాను స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి వెళ్తున్నట్టు తెలిపాడు. ఆ తరువాత రేణుకాస్వామి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబసభ్యుల్లో భయం నెలకొంది. చిత్రదుర్గ చెళ్లకెరె గేట్ వద్ద బాలాజీ బార్ వద్ద బైక్ లభ్యమైంది. సోమవారం మధ్యాహ్నం కామాక్షిపాళ్య పోలీసులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కుమారుని హత్య వార్త తెలిసి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పలుచోట్ల భద్రత పెంపు
పోలీసులు దర్శన్, పవిత్ర, ఇతర నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య బౌరింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపి తరువాత తమ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 మంది నిర్బంధంలో ఉన్నారు. దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేయలేదని, విచారణ కోసం మాత్రమే తీసుకెళ్లారని ఆయన లాయర్ నారాయణస్వామి మీడియాకు తెలిపారు. దర్శన్‌ను వెస్ట్ డీసీపీ గిరీశ్ విచారిస్తున్నారని తెలిపారు. మొత్తం ఈ వ్యవహారం రాష్ట్ర సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర సంచలనానికి కారణమైంది. పలువురు సెలబ్రిటీలు విస్మయం వ్యక్తంచేశారు.
దర్శన్ ప్రమేయంపై విచారణ : హోంమంత్రి
శివాజీనగర: ఓ హత్య కేసులో నటుడు దర్శన్ పాత్ర గురించి విచారణ జరుగుతోంది, ఆ తరువాతనే స్పష్టత వస్తుందని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం నగరంలో ఆయన మాట్లాడుతూ చిత్రదుర్గకు చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో దర్శన్ పేరు వినిపించింది. అందుచేత విచారణ కోసం ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందుగా అరెస్ట్ అయిన నిందితులు దర్శన్ పేరు చెప్పారు. ఏ కారణానికి హత్య జరిగింది? దర్శన్ పేరు ఎందుకు వచ్చింది అనేది దర్యాప్తు తరువాతనే స్పష్టమవుతుంది అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment