ఆగిన కంచుమేళం!
అనారోగ్యంతో కోయకళాకారుడు, పద్మశ్రీ సకిని రామచంద్రయ్య మృతి
మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన భ ద్రాద్రి కలెక్టర్ జితేష్
సంతాపం తెలిపిన మంత్రులు
ఖమ్మం: కంచుమేళం శాశ్వతంగా ఆగిపోయింది. ఆదివాసీ సంప్రదాయ కళల రక్షకుడు, మణుగూరు మండలం బావికూనవరం గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) తుదిశ్వాస విడిచారు. అంతరించిపోతు న్న గిరిజన కళలను కాపాడుతూ, కాలినడకన మారుమూల గ్రామాల్లో తిరుగుతూ భవిష్యత్ తరాలకు అందించిన జానపద కళాకారుడు, డోలు వాయిద్య కారుడు అయిన రామచంద్రయ్య కొంతకాలంగా గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతూ మృతి చెందారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కంచుతాళం, కంచుమేళంతో ఆదివాసీ కథలు అలవోకగా, కళ్లకు కట్టినట్లు వివరించగలగిన ఏకైక కళాకారుడు రామచంద్రయ్య మృతిపట్ల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ ్వరరావు సంతాపం తెలిపారు.
కుటుంబ సభ్యులకు కలెక్టర్ హామీ..
భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కూనవరంలోని రామచంద్రయ్య మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం, స్థలం సమస్య ప్రస్తావించగా, పరిశీలించి సమస్య పరిష్కరిస్తానని, అంత్యక్రియల అనంతరం తన వద్దకు రావాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
అందని నాటి ప్రభుత్వ సాయం..
సకిని రామచంద్రయ్య వనదేవతల వీరగాథలు చెప్పడంతో పాటు రెండేళ్లకోసారి వచ్చే ఆదివాసీ జాతరైన సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజుల వంటి దేవరుల కథను కళ్లకు కట్టినట్లుగా గానం చేయడంతో పాటు సమ్మక్క సారలమ్మ తల్లులను గద్దెల వద్దకు తీసుకు వచ్చే క్రమంలో కీలకంగా వ్యవహరిస్తారు. అంతరించిపోతున్న ఆదివాసీ కళలను కాపాడుతున్న తీరును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022 జనవరి 25న పద్మశ్రీ అవార్డు అందజేసింది.
అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సత్కరించింది. ఆ వెంటనే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.కోటి ఆర్థికసాయంతో పాటు 426 చదరపు గజాల ఇంటి స్థలం అందిస్తామని ప్రకటించింది. కానీ ఇవ్వలేదు. అనారోగ్యంతో ఉన్న తనకు ఆర్థిక సాయం అందించి, కాపాడాలని కలెక్టరేట్ చుట్టూ తిరిగినా, అధికారులకు విన్నవించినా మోక్షం కలగలేదు. కళాకారులకు అందించే రూ.10 వేల పింఛన్ అందించడంలోనూ జాప్యం జరిగింది.
పలుమార్లు కలెక్టర్లకు విన్నవించి నా ఆర్థికసాయం ట్రెజరీ నుంచి రావాలంటూ సమాధానం రావడంతో వైద్య పరీక్షలకు అప్పులు చేసి రూ.4 లక్షలతో వైద్యం చేయించుకున్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో మణుగూ రు వచ్చిన రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కను కలిసి న్యాయం చేయాలని వేడుకోగా.. ఆమె ఆర్థిక సా యం అందించారు. ఎన్నికల కోడ్ ముగిశాక కలవా లని సూచించగా, ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 21న మళ్లీ సీతక్కను కలిశారు. దీంతో నాలుగైదు రోజుల్లో చెక్కు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కాగా ఈ లోపే రామచంద్రయ్య మృతి చెందారు.
జానపద కళకు తీరని లోటు: భట్టి
ఖమ్మంవన్‌టౌన్ : అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడిన పద్మశ్రీ సకిని రామచంద్రయ్య మృతి జానపద కళకు తీరని లోటని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారసత్వంగా వచ్చిన గిరిజన సంప్రదాయ కళను జీవనాధారంగా చేసుకొని డోలు వాయిద్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించి పెట్టారని కొనియాడారు. రామచంద్రయ్య కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో మరణించడం బాధాకరం..
ఖమ్మంమయూరిసెంటర్: కోయ అధ్యయన వేదిక ఆత్మీయ మిత్రుడు, సమ్మక్క సారలమ్మ తదితర కోయ వీరపురుషుల కథా గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సకిని రామచంద్రయ్య ఆర్థిక ఇబ్బందులతో మరణించడం బాధాకరమని ప్రముఖ కవులు పద్దం అనసూయ, డాక్టర్ గూడూరు మనోజ, జయధీర్ తిరుమలరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన వయసు పైబడి మరణించలేదని, గత ప్రభుత్వం ఇస్తామన్న రూ. కోటి ఆర్థిక సాయం నేటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోయ ఆదివాసీ కళాకారుడు ఇలాంటి స్థితిలో మృతిచెందడం కలచి వేస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment