మహిళను రక్షించిన పోలీసులు
కారేపల్లి: డయల్ 100కు ఫోన్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు ఓ మహిళను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించిన ఘటన మండలంలోని ఓ తండాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని ఓ తండాలో దంపతుల మధ్య గొడవ జరుగుతుండటంతో డయల్ 100కు ఫోన్ చేశారు. స్పందించిన కారేపల్లి కానిస్టేబుల్ సీతారాములు, డ్రైవర్ సైదులతో వాహనంలో తక్షణమే తండాకు చేరుకున్నారు. అప్పటికే దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవటంతో, భార్య తీవ్ర మనస్తాపంతో ఇంట్లోనే తలుపులు వేసుకొని ఉరివేసుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులకొట్టి లోనికి వెళ్లి ఆమెను కిందికి దింపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు స్థానిక మహిళల సహకారంతో సీపీఆర్ చేసి, ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. కానిస్టేబుల్ సీతారాములు, డ్రైవర్ సైదులును కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.
వరుస చోరీలతో ఆందోళన
తిరుమలాయపాలెం: రైతులకు చెందిన విద్యుత్ మోటార్ల కాపర్ వైర్లను దుండగులు చోరీ చేస్తున్నారు. మండలంలోని ఎదుళ్లచెరువులో గతంలో రెండు సార్లు పలువురు రైతులకు చెందిన మోటార్లలోని కాపర్ వైర్లు చోరీ జరగగా శనివారం రాత్రి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు చెందిన ఆరు విద్యుత్ మోటార్ల వైర్లను ఎత్తుకెళ్లారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజంతా పనులు చేసుకుంటున్న తాము రాత్రి సమయంలో వస్తున్న దొంగలను ఎలా పట్టుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని ఎస్‌ఐ కూచిపూడి జగదీశ్ దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment