
అంగన్‌వాడీ కేంద్రాలకు హంగులు
● రూ.1.19 కోట్లతో మౌలిక వసతుల కల్పన ● కలెక్టర్ చొరవతో చకచకా పనులు
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోగా, కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఇదేసమయాన కేంద్రాల్లో వసతులు కల్పించేందుకు సిద్ధంకాగా, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రతిపాదనలు రూపొందించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించగా, త్వరగా పూర్తయ్యేలా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించడంతో చకచకా పనులు కొనసాగుతున్నాయి.
మరుగుదొడ్లు, ఇతర వసతులు
జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆధునిక హంగులు సమకూర్చడం ద్వారా పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందుతాయని కలెక్టర్ తరచుగా చెబుతున్నారు. ఆయన సూచనలతో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా కేంద్రాలకు ప్రహరీలు, టాయిలెట్లు నిర్మించడంతో పాటు వంట చేసేందుకు ప్లాట్‌ఫామ్‌లు నిర్మించనున్నారు. జిల్లాలోని 13 కేంద్రాల్లో కిచెన్ ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణానికి రూ.2లక్షలు, 40 సెంటర్లలో తాగునీటి వసతి కల్పించేందుకు రూ.17వేల చొప్పున, సొంత భవనాలు ఉన్న 239 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.36వేలు చొప్పున మొత్తం 1.19లక్షల నిధులు కేటాయించారు. సత్తుపల్లి, ఖమ్మం డివిజనల్లో పీఆర్ ఈఈలు, కేఎంసీ పరిధిలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ఈఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.
వసతుల కల్పనతో బలోపేతం
అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతులు కల్పిస్తూ బలోపేతం చేస్తున్నాం. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచనలతో రూ.1.19కోట్ల నిధులు కేటాయించాం. ఈ నిధులతో చేపడుతున్న పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నాం.
– కీసర రాంగోపాల్‌రెడ్డి, జిల్లా సంక్షేమాఽధికారి

అంగన్‌వాడీ కేంద్రాలకు హంగులు
Comments
Please login to add a commentAdd a comment