
ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్ల ఎంపికకు కసరత్తు
ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల కొరతను అధిగమించేందుకు అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉపాధికల్పన అధికారి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న వారి జాబితా తెప్పించుకున్నారు. ఇందులో 140 మంది ఉండగా గురువారం 85 మందిని పిలిపించి సర్టిఫికెట్లు పరిశీలించారు. మిగతా వారి సర్టిఫికెట్ల పరిశీలన రెండు, మూడు రోజుల్లో పూర్తిచేస్తామని అధికారులు వెల్లడించారు.
నాలుగు నెలల కాలానికి..
ఆర్టీసీలో డ్రైవర్లు ఉద్యోగ విరమణ చేస్తున్న క్రమాన కొరత ఏర్పడుతోంది. అయితే, కొత్త డ్రైవర్ల నియామకానికి మరింత సమయం పట్టనుండడంతో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. నాలుగు నెలల కాలానికి గాను కాంట్రాక్ట్ విదానంలో డ్రైవర్లను తీసుకోవాలని అధికారులు నిర్ణయించగా, ఖమ్మం రీజియన్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేసి సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నారు. ఎంపికై న వారి సేవలను నాలుగు నెలల పాటు వినియోగించుకోనున్నారు.
హైర్ బస్సు డ్రైవర్ల ఆందోళన
ఆర్టీసీ అద్దె బస్సుల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారు తమను కూడా కాంట్రాక్ట్ విధానంలో విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో తాము పేర్లు నమోదు చేసుకున్నా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. దీంతో రీజియన్ అధికారులు ఉన్నతాధికారులతో చర్చించాక వారి సర్టిఫికెట్లను కూడా పరిశీలించారు. ప్రక్రియ పూర్తయ్యాక జాబితాను రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని అధికారులు వెల్లడించారు.
తొలిరోజు 85 మంది సర్టిఫికెట్ల పరిశీలన
తమనూ పరిగణనలోకి తీసుకోవాలని అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment