
ఇందిరమ్మ లబ్ధిదారులకు అండగా నిలుస్తాం..
● పేదలు సొంతింటి కల నిజం చేసుకోవాలి ● రేపల్లెవాడలో పర్యటించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఏన్కూరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రతీ దశలో అండగా నిలుస్తామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ భరోసా కల్పించారు. ప్రభుత్వం కేటాయించే నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ పేదలు సొంతింటి కలను నిజం చేసుకోవాలని సూచించారు. ఏన్కూరు మండలం రేపల్లెవాడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత గ్రామంలో సాగయ్యే పంటలు, దిగుబడి, మద్దతు ధరపై ఆరా తీశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్లు ఎలా కట్టుకోవాలనేది లబ్ధిదారులు నిర్ణయించుకోవాలని.. ఇదేసమయాన ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల్లో పూర్తయ్యేలా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతీ మండల కేంద్రంలో ఇసుక డంప్ ఏర్పాటుచేసి తక్కువ ధరకే లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తామన్నారు. కాగా, అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయని తెలిపారు. కాగా, గ్రామంలో వీధి కుక్కల సమస్య ఉందని స్థానికులు చెప్పగా పరిష్కరించాలని ఎంపీడీఓ రమేష్‌ను ఆదేశించారు. హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ శేషగిరిరావు, పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధనకు పట్టుదలతో కృషిచేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను సందర్శించిన ఆయన డార్మిటరీ, కిచెన్, డైనింగ్ హాల్, తరగతి గదులను పరిశీలించాక ఇంటర్, పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న తీరుపై ఆరాతీసిన ఆయన నెల పాటు చదువుకే ఎక్కువ సమయం కేటాయించాలని, తద్వారా మంచి మార్కులు సాధించొచ్చని తెలిపారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీఓ రమేష్, ఉపాధ్యాయులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment