వర్షాకాలంలోగా పనులు పూర్తి చేయాలి
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులు వర్షాకాలం లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడులో రూ.2.50 కోట్లు, వెంకటగిరిలో రూ.2.40 కోట్లు, గుదిమళ్లలో రూ.1.95 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల అవసరాల మేరకు ఇంకా ఏమైనా రోడ్లు నిర్మించాల్సి ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం గుదిమళ్లలోని తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ హేమలత, ఆర్‌డీఓ నర్సింహారావు, పంచాయతీరాజ్ ఈఈ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎ. శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పి.రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం


