బోనకల్: దివ్యాంగుల స్వయం ఉపాధి పథకాల కోసం మండలానికి కొద్దిసంఖ్యలో యూనిట్లు కేటాయించగా పెద్దసంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఈక్రమంలోనే బోనకల్ మండలానికి రూ.50వేల విలువైన మూడు యూనిట్లు కేటాయిస్తే ఆన్‌లైన్‌లో 257మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎంపీడీఓ రమాదేవి, ఐసీడీఎస్ సీడీపీఓ బాల త్రిపురసుందరి ఆధ్వర్యాన డ్రా ద్వారా ముగ్గురిని ఎంపిక చేశారు. ఈనేపథ్యాన మిగతా వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న సమయాన అందరికీ రుణాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ముగ్గురినే ఎంపిక చేయడం సరికాదని మండిపడ్డారు. దీంతో ఖమ్మం – బోనకల్ రహదారిపై బైఠాయించగా సీపీఎం నాయకులు కిలారు సురేష్, తెల్లాకుల శ్రీను, గుగులోతు నరేష్ తదితరులు సంఘీబావం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
నేలకొండపల్లిలో ఒకటే...
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలో దివ్యాంగుల కోసం ఒకటే యూనిట్ కేటాయించగా 180 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం నిర్వహించిన డ్రాకు 124 మంది హాజరయ్యారు. వీరిలో లాటరీ ద్వారా ముగ్గురిని ఎంపిక చేసి ఖరారు చేసేందుకు జిల్లా యంత్రాంతానికి పంపినట్లు అధికారులు తెలిపారు. సీడీపీఓ కవిత, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓ శివ, సూపర్‌వైజర్ లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ రుణాలు ఇవ్వాలని
దివ్యాంగుల నిరసన


