ఆరు వేల టన్నుల బరువైన కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు తెలిపారు. దీంతో శిథిలాల తొలగింపు నిర్ణయాన్ని పక్కన పెట్టి, భవనం కింద నుంచి తవ్వుతూ లోపలికి వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ వరకు చేరాలని నిర్ణయించారు. బొగ్గు గనుల్లో నేలను తవ్వుతూ భూగర్భంలోకి వెళ్లినట్టుగా ఆరువేల టన్నుల బరువైన శిథిలాల కింద నేలను తవ్వడం మొదలెట్టారు. ఇలా తవ్వుకుంటూ(ఎలుక బొరియ చేసినట్టుగా) బాధితుడు కామేశ్వరరావు ఉన్న ప్రదేశం కిందకు చేరుకోవాలని, ఆ తర్వాత బాధితుడికి ఇబ్బంది లేకుండా పైన ఉన్న బరువులు పడకుండా రక్షించాలని నిర్ణయించారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న ఇంకో బాధితుడు ఉపేందర్ ఉనికిని గుర్తించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.


