ఖమ్మంవ్యవసాయం : వినియోగదారులకు నాణ్యమైన పాలు, పదార్థాలే విక్రయించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ప్రణాళికతో వ్యాపారాలను విస్తరించాలని సూచించారు. ఖమ్మం నగరంలోని బుర్హాన్‌పురంలో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పార్లర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధిరలో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు చేశామని, విజయ డైరీతో సమన్వయం చేసుకుంటూ పాడి రైతుల నుంచి పాలు సేకరించి సరఫరా చేస్తున్నామని తెలిపారు. డెయిరీ పార్లర్ నిర్వాహకులకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. మిల్క్ షేక్, పాలు, పండ్ల రసాలు వంటివి కూడా విక్రయించి వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్నారు. కార్యక్రమంలో విజయ డెయిరీ డీడీ మోహన్ మురళీ, డిస్ట్రిబ్యూటర్లు నరేష్, జగదీష్, పార్లర్ నిర్వాహకులు మదార్ పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజల జీవన వ్యవస్థ సజావుగా సాగేలా కృషి చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం బస్ డిపో సిబ్బందికి గురువారంఆయన వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కార్మికుల కృషి ఫలితంగా మెరుగైన రవాణా సేవలు అందుతున్నాయని అన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు చాలా కష్టపడి పని చేస్తున్నారని, వేసవికాలంలో వారికి ఉపయోగపడేలా 650 వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్మికుల సమస్యలను డిపో మేనేజర్ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఆర్థిక పరమైన ప్రణాళికలపై లీడ్ బ్యాంక్ మేనేజర్‌తో శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ మల్లయ్య, డిపో మేనేజర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఐకేపీ కొనుగోలు కేంద్రాలను పెంచాం..
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో గతంలో 37 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఉండగా ప్రస్తుత యాసంగి సీజన్‌లో 137కు పెంచామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సెర్ప్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తీసుకుంటున్న చర్యలు, యాసంగిలో ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాలపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. 2022–23 సంవత్సరానికి సంబంధించిన కమీషన్ పౌర సరఫరాల శాఖ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. గన్నీ బ్యాగులు రీకన్సిలేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. దివ్యాంగుల నిర్ధారణకు ఆస్పత్రుల్లో అవసరమైన పరికరాల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, డీఈఓ సోమశేఖర శర్మ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
విజయ డెయిరీ పార్లర్ ప్రారంభోత్సవంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్


