ఖమ్మంవ్యవసాయం: రానున్న వానాకాలం, యాసంగి పంటల సీజన్లలో విద్యుత్ వినియోగం అంచనా, నిర్వహించాల్సిన పనులపై టీజీ ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో ఉమ్మడి జిల్లా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఖమ్మంలోని ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో రెండు సంస్థల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలస్థాయి అధికారుల సమన్వయ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రానున్న పంట సీజన్లలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన, మెరుగైన సరఫరా చేయడంపై చర్చించారు. 220/132 సబ్‌స్టేషన్లలో చేపట్టాల్సిన పనులు, అందుకు కావాల్సిన నిధులపై ప్రతిపాదనలు రూపొందించారు. వానాకాలం పంటల సీజన్ నాటికి నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం జరుగుతున్న పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. అలాగే, విద్యుత్ వినియోగం ఆధారంగా అవసరమైన చోట్ల నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటుపైనా చర్చించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ బి.శ్రీనివాస్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, జి.మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


