ఏన్కూరు: మండలంలోని నెమలిపురి సమీపాన శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడగా పలువురు కూలీలకు గాయాలయ్యాయి. మిర్చి తోటల్లో పనికి మూలపోచారం నుండి నెమలిపురి వైపు మహిళా కూలీలు ట్రాక్టర్‌లో బయలుదేరారు. ఈక్రమాన వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో 20మంది కూలీలు గాయపడగా, వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
వైన్స్ షాపులో చోరీ
కొణిజర్ల: కొణిజర్లలోని శ్రీ లక్ష్మీనరసింహా వైన్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన సిబ్బంది రేకులు తొలగించి ఉండడం, సమీపాన చేన్లలో మద్యం బాటిళ్లు కనిపించడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు వైన్ షాప్ యజమాని చేరుకుని ఎంత మేర స్టాక్ అయిందో సాయంత్రం వరకు లెక్కలు వేస్తున్నారు. అయితే, యజమాని నుంచి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ జి.సూరజ్ తెలిపారు.


