దుకాణాలకు చేరుతున్న సన్నబియ్యం
● ప్రతీ షాప్‌నకు 50 క్వింటాళ్లు తగ్గకుండా సరఫరా ● ఏప్రిల్ 1నుంచి పంపిణీకి ఏర్పాట్లు
నేలకొండపల్లి: రేషన్‌షాప్‌ల ద్వారా వచ్చేనెల 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక జిల్లాలో కూడా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈమేరకు పౌరసరఫరాల శాఖ గోదాంల నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు బియ్యం చేరవేస్తున్నారు. ఆపై రేషన్‌షాపులకు పంపిస్తున్నారు. అయితే, గడువు తక్కువగా ఉండడంతో ప్రతీ షాప్‌నకు కనీసం 50క్వింటాళ్లకు తగ్గకుండా సన్న బియ్యం చేరవేస్తుండగా, పెద్ద గ్రామాల్లోనైతే కావాల్సిన బియ్యంలో 80–90 శాతం మేర సన్నబియ్యమే పంపిస్తున్నారు.
సరఫరా చేసేది ఎలా?
ఇన్నాళ్లు లావు రకాల బియ్యం సరఫరా చేస్తుండడంతో రేషన్ లబ్ధిదారులు చాలా మంది తీసుకోవడం లేదు. కానీ సన్నబియ్యం పంపిణీ మొదలైతే అందరూ ముందుకొచ్చే అవకాశముంది. అయితే, ప్రభుత్వం ఏప్రిల్ నెలకు కావాల్సిన మొత్తం బియ్యం సన్నరకాలు పంపడం లేదు. దీంతో లబ్ధిదారులకు తామేం సమాధానం చెప్పాలని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఒకటి, రెండురోజుల్లోనే సన్నం బియ్యం స్టాక్ అయిపోయి, ఆతర్వాత దొడ్డు బియ్యం ఇస్తే కార్డుదారులు తిరగబడే ప్రమాదముందని వాపోతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తొలి విడత ఇచ్చిన సన్నబియ్యం ఖాళీ కాకముందే మరోదఫా పంపిణీ చేయాలని అధికారులను కోరుతున్నారు.


