టెల్‌గూ న్యూ ఇయర్..
గూడు లేని గండుకోయిల
దాగేందుకు గున్నమావి గుబురులు కానరాక
తినేందుకు ఎర్రెర్రని చిగురులు లేక
అంతరంగాన సమస్యల సుడిగండాల సుళ్లు తిరుగుతున్నా
అరంగుళం మందాన వేసుకున్న మేకప్‌తో కప్పిపుచ్చుతున్న అతివలా
గొంతెత్తి కూస్తోంది కుహూ కుహూ మంటూ తీయగా
ఏ.ఐ. కోయిల అవతారమెత్తి!
వాట్సాప్ సందేశాల వెల్లువలో మునుగుతూ
సంప్రదాయమంతా అంతర్జాల
చిత్రాల్లో తప్ప ప్రత్యక్షంగా కాంచలేక చిత్తరువులైన జనులు
విశ్వాసం కోల్పోయి వసిస్తున్నా
నూతన పదం ఆకర్షణకు లోనై ఆశను శ్వాసిస్తూ
విశ్వావసు నామ సంవత్సరాదికి
స్వాగతం పలుకుతూ!
–దీకొండ చంద్రకళ, చర్చికాంపౌండ్, ఖమ్మం


