మక్క రైతులకు భరోసా | - | Sakshi
Sakshi News home page

మక్క రైతులకు భరోసా

Mar 31 2025 8:33 AM | Updated on Mar 31 2025 8:33 AM

మక్క

మక్క రైతులకు భరోసా

● మార్క్‌ఫెడ్‌ ద్వారా పంట కొనుగోళ్లకు రంగం సిద్ధం ● ఉమ్మడి జిల్లాలో 55 కేంద్రాలకు పైగా ఏర్పాటు ● ఈ వారంలోనే పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌ల ద్వారా కొనుగోళ్లు

ఖమ్మం వ్యవసాయం: యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట చేతికందుతోంది. మక్కలకు ప్రైవేటు మార్కెట్‌లో కనీస మద్దతు ధర లభించడం లేదు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మక్కలు క్వింటాకు రూ.2,225 ధర ప్రకటించగా, వ్యాపారులు రూ.2వేల నుంచి రూ.2,100 మించి చెల్లించడం లేదు. దీంతో పంట కొనుగోలుకు ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగు చేసే ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ను ప్రభుత్వం ఆదేశించగా.. రాష్ట్రంలో పంట సాగు ఆధారంగా 320 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కొనుగోళ్లు మొదలుకానున్నాయి.

1.30లక్షలకు పైగా ఎకరాల్లో సాగు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మొక్కజొన్న విస్తారంగా సాగు చేశారు. ఖమ్మం జిల్లాలో 1,14,901 ఎకరాల్లో, భద్రాద్రి జిల్లాలో 16,938 ఎకరాల్లో పంట సాగైంది. ఎకరాకు 35 క్వింటాళ్ల చొప్పున రెండు జిల్లాల్లో దాదాపు 5.50 లక్షల క్వింటాళ్ల మక్కలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యాన 55కు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో ఖమ్మం జిల్లాలో 44, భద్రాద్రి జిల్లాలో 11 నుంచి 15 కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి.

పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌కు బాధ్యతలు

ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌), జిల్లా కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌)ల ద్వారా మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో పీఏసీఎస్‌ల ద్వారా 38 కేంద్రాలు, డీసీఎంఎస్‌ల ద్వారా ఆరు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో పీఏసీఎస్‌ల ద్వారా 11 నుంచి 15 కేంద్రాల ఏర్పాటు చేస్తారు.

వారం రోజుల్లో కొనుగోళ్లు..

పంట కోతలు, నూర్పిళ్లు ప్రారంభం కావడంతో ఏప్రిల్‌ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్క్‌ఫెడ్‌ నిర్ణయించింది. రవాణా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన మార్క్‌ఫెడ్‌.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇప్పటికే పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లా యంత్రాంగం దిశానిర్దేశం చేసింది.

ఎక్కడెక్కడ..

ఖమ్మం జిల్లాలో పీఏసీఎస్‌ల ద్వారా బ్రాహ్మణపల్లి, మోటమర్రి, కలకోట, లక్ష్మీపురం, రావినూతల, ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, రామాపురం, పెద్దబీరవెల్లి, నారాయణపురం, బోనకల్‌, చిరునోముల, నాగులవంచ, పాతర్లపాడు, పొద్దుటూరు, పందిళ్లపల్లి, కొణిజర్ల, పెద్దమునగాల, పల్లిపాడు, రాజేశ్వరపురం, ముజ్జుగూడెం, మర్లపాడు, కందుకూరు, భరణిపాడు, మోటాపురం, జీళ్లచెరువు, ముదిగొండ, వనంవారి కిష్టాపురం, పెద్దమండవ, మేడేపల్లి, వీ.వీ.పాలెం, అల్లీపురం, తల్లాడ, మాధారం, కొండకొడిమ, సోమవరం, హస్నగుర్తి, కేశవాపురంలో కేంద్రాలు ఏర్పాటవుతాయి.

డీసీఎంఎస్‌ ద్వారా రాయిగూడెం, అనాసాగరం, గువ్వలగూడెం, పెద్దగోపతి, తుమ్మలపల్లి, కొండాపురం, పమ్మి, లచ్చగూడెం గ్రామాల్లో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

భద్రాద్రి జిల్లాలో పీఏసీఎస్‌ల ద్వారా టేకులపల్లి, ఆళ్లపల్లి గుండాల, మర్కోడు, శెట్టిపల్లి, కొత్తగూడెం, చల్లసముద్రం, కొమరారం, ఇల్లెందు, దమ్మపేట, అశ్వారావుపేటలో కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అవసరమైతే మరో నాలుగు నుంచి ఐదు కేంద్రాల ఏర్పాటుకు కూడా ఈ జిల్లాలో అవకాశం ఉంది.

మక్కల కొనుగోళ్లకు సమగ్ర చర్యలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మక్కల కొనుగోళ్లకు సమగ్ర చర్యలు చేపట్టాం. పంట సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌ సంస్థల ద్వారా పంట కొనుగోలుకు కార్యాచరణ చేశాం. నాణ్యతా ప్రమాణాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ. 2,225 మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తాం. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. – సుునీత, మేనేజర్‌ మార్క్‌ఫెడ్‌,

ఉమ్మడి ఖమ్మం జిల్లా

మక్క రైతులకు భరోసా1
1/1

మక్క రైతులకు భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement