ధర స్థిరీకరణకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
● వచ్చే ఉగాది నాటికి కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం ● లాభాలు ఎక్కువగా వచ్చే ఆయిల్‌పామ్‌పై రైతులు దృష్టి పెట్టాలి ● ఫ్యాక్టరీ శంకుస్థాపనలో మంత్రి తుమ్మల నాగేశ ్వరరావు
వేంసూరు: పామాయిల్ ధర స్థిరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులకు ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎండీ యాస్మిన్, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఉగాది నాటికి పనులు పూర్తి చేసి ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతీ పనికి ఆటంకం కలిగించాలని కొందరు చూస్తుంటారని, పనులు ఆగితే రాక్షసానందం పొందుతారని, సీతారామ కాల్వ తవ్వాలంటే రైతులను ప్రోత్సహించి స్టే తెప్పించారని విమర్శించారు. కొందరు బ్రోకర్లు నకిలీ మొక్కలు తెచ్చి.. ఇప్పుడు ఆయిల్‌ఫెడ్‌ను బదనాం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆయిల్‌ఫెడ్ నుంచి వచ్చే మొక్కల్లో కల్తీవి ఉండవని, విదేశాల నుంచి రావడంతో ఒకటో, రెండో ఉండవచ్చు తప్ప.. మొత్తంగా నకిలీవి ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సత్తుపల్లి ప్రాంతానికి జూన్‌లోగా గోదావరి జలాలు తీసుకొస్తామని, నాగార్జున సాగర్ నిండకున్నా గోదావరి నీటితో ఈ ప్రాంత చెరువులు నింపుతామని భరోసా ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించి పది లక్షల ఎకరాలకు రెండు పంటలకూ సాగు నీరు అందిస్తామని ప్రకటించారు. ఆగస్టు 15 నాటికి జాతీయ రహదారి పనులు పూర్తవుతాయని, ఖమ్మం నుంచి 33 నిమిషాల్లో సత్తుపల్లికి వచ్చేలా కల్లూరు, వేంసూరులో ఎగ్జిట్‌లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆయిల్ పామ్‌కు గిట్టుబాటు ధర రూ.21 వేలు దాటేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మిస్తామని తెలిపారు.
వేంసూరు అభివృద్ధికి కృషి..
ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు మంత్రి తుమ్మల వేంసూరు మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 65వేల మంది రైతులు పామాయిల్ సాగు చేస్తున్నారని, వారిని ఒప్పించి 2.50లక్షల ఎకరాల్లో అయిల్ పామ్ సాగయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట సాగవుతోందని, ఏడాదికి 60 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. పామాయిల్ పంట కొనుగోలు చేశాక రైతుల ఖాతాల్లో మూడు రోజుల్లోనే డబ్బు జమయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్‌బాబు, నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్, తుమ్మల యుగంధర్, బొబ్బరపూడి రాఘవరావు, నరేంద్ర, పుచ్చాకాయల సోమిరెడ్డి, కాసరి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


