ఒకే వేదికపై రంజాన్, ఉగాది వేడుకలు
మధిర: ఒకే వేదికపై కులమతాలకు అతీతంగా ఉగాది, రంజాన్ పండుగలను ఘనంగా జరుపుకున్న ఘటన మధిర పట్టణంలోని టీచర్స్‌కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. టీచర్స్‌కాలనీలోని కులమతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసి అన్ని పండుగలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం ఉగాది పండుగ రావడం మరుసటి రోజు రంజాన్ పండుగ రావడంతో రెండు పండుగలను కలిపి ఒకే వేదికపై చేసుకోవాలని కాలనీవాసులు నిర్ణయించుకున్నారు. ఈ కాలనీలో ఒక వేదికను ఏర్పాటు చేసి ఉగాది పండుగకు సంబంధించిన పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడిని అందరికీ అందజేశారు. అనంతరం రంజాన్ పండుగను పురస్కరించుకొని సేమియా పంపిణీ చేశారు. ఆయా పండుగల విశిష్టతను కాలనీ పెద్దలు వివరించారు. కార్యక్రమంలో దేవరకొండ లక్ష్మణ్ బాబు, వెలగపూడి హనుమంతరావు, యరమల వెంకటేశ్వరరెడ్డి, వైవి పున్నారెడ్డి, సాంబయ్య, చీకటి నాగేశ్వరరావు, ముస్లిం పెద్దలు షేక్ నాగుల్ మీరా, షేక్ ఇబ్రహీం, ఎండి రఫీ, కాలనీ పెద్దలు పోతురాజు కృష్ణయ్య, తోట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


