● చిన్నారి సహా పది మందికి గాయాలు
ఆర్టీసీ బస్సు – లారీ ఢీ
వైరా: ఆర్టీసీ బస్సు – లారీ ఢీకొన్న ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. వైరాలోని రింగ్ రోడ్డు సెంటర్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి మణుగూరుకు వెళ్తోంది. వైరా బస్టాండ్‌లో నుండి రింగ్ రోడ్డులోకి తిరుగుతున్న సమయాన తల్లాడ వైపు నుండి ఖమ్మం వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గుండాల మండలం వేపలగడ్డకు చెందిన వరమ్మ, ఆమె కోడలు భారతి, మనవడు మూడేళ్ల దేవిక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దేవిక్‌కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఖమ్మం ఆస్పత్రికి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరికి వైరాలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. ఇక కొత్తగూడెం చెందిన రియాజ్, రుద్రంపూర్‌కు చెందిన ప్రేమ్, పాల్వంచకు చెందిన శ్రావ్యకు, తల్లాడకు చెందిన జనార్దన్, భవాని, మోక్షిత్‌కు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు బయటకు తీసి చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
మణుగూరు డిపో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. ఖమ్మం నుంచే వేగంగా, నిర్లక్ష్యంగా నడిపాడని ప్రయాణికులు, స్థానికులు వెల్ల డించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
● చిన్నారి సహా పది మందికి గాయాలు


