రాజీవ్ యువవికాసం దరఖాస్తు గడువు పొడిగింపు
కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
ఖమ్మంసహకారనగర్: యువతకు స్వయం ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ఈనెల 14 వరకు పొడిగించిందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ యువతకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా 100 శాతం సబ్సిడీపై రూ.50 వేల యూనిట్, 90 శాతం సబ్సిడీపై రూ.లక్ష యూనిట్, 80 శాతం సబ్సిడీతో రూ.2 లక్షల యూనిట్, 70 శాతం సబ్సిడీతో రూ.4 లక్షల విలువైన ఏర్పాటుకు ఈ పథకం ద్వారా చేయూత అందుతుందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే వార్షిక ఆదాయ పరిమితి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల లోపు ఆదాయం కలిగిన వారు అర్హులని, తెల్ల రేషన్ కార్డులో దరఖాస్తుదారుల పేరు లేకపోతే ఆదాయ సర్టిఫికెట్ సమర్పించొచ్చని తెలిపారు. వ్యవసాయేతర పథకాలకు 21 – 55ఏళ్లు, వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్లకు 60ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 14లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికై న వారికి యూనిట్ గ్రౌండింగ్, నిర్వహణలో శిక్షణ కూడా కలెక్టర్ ఓ ప్రకటనలో వివరించారు.
నేటి నుంచి జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు
ఖమ్మంసహకారనగర్: దేశవ్యాప్తంగా ఎన్‌టీఏ ఆధ్వర్యాన నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈమేరకు బొమ్మ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల, ఎస్‌బీఐటీ, విజయ ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల జిల్లా కోఆర్డినేటర్ పార్వతీరెడ్డి వెల్లడించారు. కాగా, 2, 3, 4, 7, 8, 9తేదీల్లో జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండు షిఫ్ట్‌లుగా పరీక్షలు ఉంటాయని, ఉదయం 8–30కు, మధ్యాహ్నం 2–30గంటలకు కేంద్రాలు మూసివేస్తామని వెల్లడించారు. విద్యార్థులు సాధారణ దుస్తులు ధరించాలని రావాలని సూచించిన ఆమె, కేంద్రాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడమే కాక పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కొనసాగుతున్న
బ్రహ్మోత్సవాలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం మూడో రోజుకు చేరాయి. ఈసందర్భంగా స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించిన అర్చకులు మండపారాధన, మన్యు సూక్త హోమంతో పాటు సామూహిక సౌభాగ్యలక్ష్మి వ్రతం జరిపించారు. ఆతర్వాత ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై గిరి ప్రదక్షణ చేయించాక భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఆలయ పర్యవేక్షకులు కె.విజయకుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, అర్చకులు రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
‘రాజీవ్ యువవికాసం’ను సద్వినియోగం చేసుకోవాలి
మధిర: అర్హులైన యువతీ, యువకులు స్వయం సమృద్ధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. మధిర మండలం దెందుకూరులో మంగళవారం పర్యటించిన ఆమె పథకానికి దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడారు. దరఖాస్తు గడువును ఈనెల14 వరకు పొడిగించినందున, అర్హులైన నిరుద్యోగ యువత ముందుకు రావాలని తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు లేకపోతే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎంపికై న వారికి యూనిట్ ఎంపిక, వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఈడీ నవీన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ యువవికాసం దరఖాస్తు గడువు పొడిగింపు


