సన్నాల సంబురం
● రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ ● పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ● సత్తుపల్లి నియోజకవర్గంలో ఒకే మండలంలో ప్రారంభం
ఖమ్మంసహకారనగర్: రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ మంగళవారం ప్రారంభమైంది. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు రెండు, మూడు రోజులుగా షాపులకు చేరవేస్తున్నారు. ఈక్రమాన మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట, సింగరేణి మండలం భాగ్యనగర్ తండాల్లో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, అలాగే పెనుబల్లి మండలం ముత్తగూడెంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి లాంఛనంగా ప్రారంభించగా.. ఖమ్మం అర్బన్ మండలం చర్చి కాంపౌండ్‌లోని షాప్‌లో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీటీ విజయ్‌కుమార్, ఆర్‌ఐ వహీద్ తదితరులు పాల్గొన్నారు. మధిర, పాలేరు నియోజకవర్గాల్లోని మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. సత్తుపల్లిలో మాత్రం పెనుబల్లి మండలంలోనే ప్రారంభమైంది. మిగతా మండలాల్లో బుధవారం నుంచి పంపిణీ చేయాలని డీలర్లకు అధికారులు సూచించినట్లు తెలుస్తుండగా.. విషయం తెలియని లబ్ధిదారులు షాప్‌ల చుట్టూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రదక్షిణలు చేశారు.
షాపుల్లో డీఎస్‌ఓ తనిఖీ
ఖమ్మంరూరల్: సన్నబియ్యం పంపిణీని ఖమ్మం రూరల్ మండలంలోని పలు షాపుల్లో డీఎస్‌ఓ చందన్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. పెదతండాలోని రేషన్ షాప్ తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నబియ్యాన్ని లబ్ధిదారులు విని యోగించుకోవాలని సూచించారు. డీలర్లు సకాలంలో షాపులు తెరవాలని తెలిపారు. కాగా, గతంలో మాదిరిగానే జిల్లాలోని ఏ షాప్‌లోనైనా పోర్టబిలిటీ విధానంలో బియ్యం తీసుకోవచ్చని డీఎస్‌ఓ వెల్లడించారు.
మహిళల్లో ఆనందం
నేలకొండపల్లి: రేషన్‌షాప్‌ల ద్వారా మంగళవారం నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తారనే సమాచారంతో లబ్ధిదారులు ఉదయాన్నే షాపుల వద్దకు చేరుకున్నారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉండగా బియ్యం తీసుకున్నాక నాణ్యతను పరిశీలించడం కనిపించింది. అంతేకాక పలువురు తమ ఇళ్లలో అప్పటికప్పుడు కొద్దిపాటి బియ్యంతో అన్నం వండి ఎలా అయిందోనని పరిశీలించడమేకాక ఇరుగుపొరుగు వారితో చర్చించారు. ఇన్నాళ్లు రేషన్‌షాపుల్లో దొడ్డుబియ్యం ఇస్తుండగా లబ్ధిదారులు ఎక్కువ మంది ఆసక్తి కనబర్చలేదు. ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ మొదలవడంతో అందరూ తీసుకునే అవకాశముందని డీలర్లు భావిస్తున్నారు.
మాలాంటి వారికి మేలు
సన్నబియ్యం తీసుకోవడం ఆనందంగా అనిపించింది. రేషన్ షాపుల్లో సన్నాలు అందిస్తూ పేదలకు ప్రభుత్వం చాలా మేలు చేస్తోంది. ఇంట్లో సన్నబియ్యం ఉంటే మాలాంటి కుటుంబాలకు ఎంతో ధైర్యం. – కణతాల లీల, కోరట్లగూడెం
ఇకపై రేషన్ బియ్యమే..
ఇప్పటివరకు దొడ్డు బియ్యం కావడంతో చాలా మంది షాప్‌ల్లో తీసుకోకపోయేవారు. ప్రస్తుతం సన్నబియ్యం కావడంతో అందరూ రేషన్ బియ్యమే తింటారు. ఈ పథకంతో పేదలకు ఎంతో మేలు జరగనుంది.
– బచ్చలకూరి వెంకట్రావమ్మ, నేలకొండపల్లి
చాలా ఆనందంగా ఉంది...
రేషన్‌షాప్‌లో ప్రతీనెలా దొడ్డు బియ్యం వచ్చేవి. అవి బాగుండక ఎక్కువ ధర పెట్టి సన్నబియ్యం కొనేవాళ్లం. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తుండడంతో మా బాధలు తప్పడం ఆనందంగా అనిపిస్తోంది.
– మార్తి సౌవిత్రి, కోరట్లగూడెం
సన్నాల సంబురం
సన్నాల సంబురం
సన్నాల సంబురం
సన్నాల సంబురం
సన్నాల సంబురం


