భగవద్గీత పోటీల్లో బంగారు పతకాలు
చింతకాని/కల్లూరు: చింతకాని మండలంలోని బస్వాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు డి.ఉమలత, కల్లూరుకు చెందిన ధరావత్ సామ్రాజ్యం భగవద్గీత శ్లోకాల కంఠస్త పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు గెలుచుకున్నారు. గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం ఆధ్వర్యాన గత నెల 21న జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ ద్వారా భగవద్గీతలోని 18అధ్యాయాలు, 700 శ్లోకాల కంఠస్త పోటీలు నిర్వహించగా వీరు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దు
ఖమ్మంవైద్యవిభాగం: విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్ సూచించారు. ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నకిలీ యాప్‌లు, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఈ మెయిల్, ఫేస్ బుక్ ఖాతాలతో పాటు బెట్టింగ్ గేమ్‌ల ద్వారా నగదు మోసాలకు పాల్పడే అవకాశముందని తెలిపారు. ఈమేరకు గుర్తుతెలియని సైట్లు, వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930కు ఫోన్ చేయడం లేదా www. cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని డీఎస్పీ తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ సరితతో పాటు సైబర్ క్రైమ్ ఎస్సై రంజిత్‌కుమార్, ఉద్యోగులు ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తాటిచెట్టు పైనుండి పడి గీతకార్మికుడు మృతి
కొణిజర్ల: ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుండి పడిన గీతకార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొండవనమలలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన తీగల సత్యం(57) మంగళవారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కే క్రమాన కింద పడ్డాడు. దీంతో ఆయనను ఆయనను 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై సత్యం భార్య స్వరూప ఫిర్యాదుతో బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
మున్నేటిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ముదిగొండ: మండలంలోని వల్లాపురంలో మున్నేటిలో గుర్తుతెలియని వ్యక్తి(32) మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకుని పరిశీలించారు. సదరు వ్యక్తి నేవీ బ్లూ కలర్ ప్యాంట్, నలుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడని, ఆయన ఆచూకీ తెలిసిన వారు సమాచచారం ఇవ్వాలని ముదిగొండ సీఐ మురళి సూచించారు. కాగా, మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్ష
ఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం బుర్హాన్‌పురానికి చెందిన బత్తినేని రేణుక వద్ద రాపర్తినగర్‌కు చెందిన వెడగోట్టు హన్మంతు 2018 జూలైలో రూ.4లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2019 ఫిబ్రవరిలో రూ.4.50లక్షలకు చెక్కు జారీ చేసినా ఆయన ఖాతాలో నగదు లేక తిరస్కరణ గురైంది. దీంతో రేణుక తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఈఈ కేసు విచారణ అనంతరం హన్మంతుకు ఆరు నెలల శిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.4.50లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.
భగవద్గీత పోటీల్లో బంగారు పతకాలు


