రైతు బజార్లలో దళారులకు స్థానం లేదు..
ఖమ్మంవ్యవసాయం: రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలను రైతుబజార్‌లో నేరుగా అమ్ముకునేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ పక్కన నిర్మించిన రైతుబజార్‌ను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి గురువారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గతంలో ఉన్న స్థానంలోనే రైతులకు ఉపయోగపడేలా కలెక్టర్ ప్లాట్ ఫామ్స్, షెడ్లను నిర్మించడం అభినందనీయమన్నారు. అయితే, పంట పండించే రైతులకే ఇక్కడ స్థానం కల్పించాలే తప్ప దళారులకు చోటు ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు. కాగా, మొక్కజొన్న కొనుగోళ్లు త్వరగా మొదలుపెట్టేలా చూస్తామని మంత్రి తెలిపారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలన్నారు. ఖమ్మం గాంధీచౌక్‌లో రూ.35 లక్షల వ్యయంతో మరో రైతుబజార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
దేశానికి ఎనలేని సేవ చేసిన కాంగ్రెస్
స్వాతంత్య్ర ఉద్యమంలోనే కాక దేశాభివృద్ధికి కాంగ్రెస్ ఎనలేని సేవలు చేసిందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ బీజేపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేలా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్ర నిర్వహించాలని సూచించారు. ఇదే సమయాన రాష్ట్రంలో కాంగ్రెస్ అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో పాటు కార్పొరేటర్లు కమర్తపు మురళి, గజ్జల లక్ష్మీవెంకన్న, కన్నం వైష్ణవిప్రసన్న, నాయకులు యర్రం బాలగంగాధర్ తిలక్, కొత్తా సీతారాములు, బాణాల లక్ష్మణ్, బోజెడ్ల సత్యనారాయణ, నల్లపు శ్రీనివాస్, జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు


