సీపీఎం రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ మృతి
● మధురైలో గుండెపోటుతో హఠాన్మరణం ● నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నాయకులు
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్(62) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. మధురైలో జరుగుతున్న పార్టీ అఖిల భారత మహాసభల్లో పాల్గొనేందుకు జిల్లా నాయకులతో కలిసి ఆయన వెళ్లారు. ఈక్రమాన శనివారం గుండెపోటు రావడంతో మధురైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స కొనసాగుతుండగానే ఆదివారం మరోమారు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించారు. కాగా, శ్రీకాంత్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన భార్య సుకన్య ఐద్వా నాయకురాలిగా కొనసాగుతుండగా, రెండు సార్లు ఖమ్మం కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
పార్టీలు, సంఘాల నేతల సంతాపం
శ్రీకాంత్ మృతి చెందినట్లు తెలియగానే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.సుదర్శన్‌్‌రావు తదితరులు మధురైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీ నాయకులు ఎం.సాయిబాబు, జూలకంటి రంగారెడ్డి, జ్యోతి, బండారు రవికుమార్, పాలడుగు భాస్కర్, ఎం.డీ.జహంగీర్, డీ.జీ.నర్సింహారావు, భారతి, సుధాకర్‌రెడ్డి తదితరులతో పాటు వివిధ జిల్లాల నాయకులు సైతం నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కాగా, శ్రీకాంత్ మృతిపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు తదితరులు సంతాపం ప్రకటించారు.
కార్మిక కుటుంబంలో జన్మించి..
ఖమ్మంలోని సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించిన యర్రా శ్రీకాంత్ విద్యార్థి దశలో ఎస్‌ఎఫ్‌ఐ ద్వారా ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1980లో సీపీఎంలో చేరి 1991నుండి పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నారు. 2019లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తొలిసారి ఎన్నికై న ఆయన 2021, 2025లో జరిగిన రాష్ట్ర మహాసభల్లోనూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు అసంఘటితరంగ కార్మికులు 1,300 మందిని సమీకరించి ఉద్యమించిన శ్రీకాంత్ వారికి పీఎఫ్, ఇతర సౌకర్యాలు సాధించారు. 2000లో జరిగిన విద్యుత్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతో పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్మికుల తరఫున పోరాడమే కాక మార్కెట్ తరలింపును ఆపాలని ఉద్యమించారు. పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాల సాధనకు పదేళ్ల పాటు జరిగిన పోరాటంలో కీలకంగా వ్యవహరించి వెంకటగిరి, కోటనారాయణపురం, సత్యనారాయణపురం తదిత ర ప్రాంతాల్లో స్థలాలు, ఇళ్లు ఇప్పించారు. విద్యుత్ పోరాటంలో జైలు జీవితం కూడా గడిపారు.
ఎంపీ పరామర్శ
గుండెపోటుతో మధురైలో మృతి చెందిన ఎర్రా శ్రీకాంత్ కుటుంబీకులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. ఆయన వెంట కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, తోట వీరభద్రం, మాజీ కౌన్సిలర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
సీపీఎం రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ మృతి


