
కాలేజీ ఇక యూనివర్సిటీ
● ‘గూడెం’ ఇంజనీరింగ్ కాలేజీ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ ● కాకతీయ యూనివర్సిటీ నుంచి విడిపోయి స్వయంప్రతిపత్తి ● త్వరలోనే ఖమ్మం పీజీ సెంటర్ కూడా ఇదే పరిధిలోకి?
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేసింది. ఈ కళాశాల దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉండగా 300ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు సీఎంకు వినతులు ఇవ్వగా ఆయన కృషి ఫలించినట్ట యింది. రాష్ట్ర విద్యార్థులు ఇన్నాళ్లూ ఎర్త్ సైన్సెస్ కోర్సులు చదవాలంటే సెంట్రల్ యూనివర్సిటీలకు వెళ్లాల్సి వచ్చేది. 2025–2026 విద్యాసంవత్సరం నుంచే యూనివర్సిటీ అంబాటులోకి రానుండడంతో విద్యార్థుల ఇక్కట్లు తీరనున్నాయి.
పరిశోధనలకు అనువుగా..
ఇతర ప్రాంతాలతో పోలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాతావరణం కొంత వేరుగా ఉంటుంది. ఇక్కడ ఎండ, వాన, చలి అన్నీ ఎక్కువే. యూనివర్సిటీ ఏర్పాటు, కొత్త కోర్సులు అందుబాటులోకి రానుండడంతో అలాంటి వాటిపై అధ్యయనం చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. సహజ వనరులకు నెలవైన కొత్తగూడెంలో యూనివర్సిటీ ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరవడంతో విద్యార్థులు, అధ్యాపకులు సోమవారం సంబురాలు జరుపుకున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం సింగరేణితో పాటు వివిధ కంపెనీల్లో పని చేస్తున్న వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేయూ నుంచి విడిపోనున్న ఇంజనీరింగ్ కాలేజీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయడంతో ఈ కాలేజీ కేయూ నుంచి విడిపోనుంది. 1978లో స్కూల్ ఆఫ్ మైన్స్‌గా ఓయూ పరిధి నుంచి కొత్తగూడెంలో పీజీ సెంటర్ ఏర్పాటైంది. తొలినాళ్లలో బీఈ మైనింగ్‌తో పాటు ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులు ఉండగా, కేయూ ఏర్పాటయ్యాక 1996లో ఈ పరిధిలోకి చేర్చి యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌గా మార్చారు. ఆ సమయాన ఈఈఈ, సీఎస్‌ఈ కోర్సులు, 2010లో ఐటీ, ఈసీఈ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చినా మధ్యలో ఎమ్మెస్సీ జియాలజీ కోర్సు తొలగించారు. ఇప్పుడు కేయూ నుంచి విడిపోతున్నందున బోధన, బోధనేతర పోస్టులే కాక కాలేజీ ఆస్తులన్నీ బదలాయిస్తారు. ఇక కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో నియామకమైన అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ బిక్షాలు, డాక్టర్ వెంకటరమణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ రాధిక, డాక్టర్ సుమలత కేయూలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వీరి డిప్యూటేషన్లు రద్దు చేస్తారా, లేక ఆప్షన్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాగా, ఖమ్మంలోని కేయూ పీజీ సెంటర్‌ను సైతం కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలోకి బదలాయించే అవకాశముందని చర్చ జరుగుతోంది.