రైతుకు చేయూత.. కిసాన్ రిమోట్
●2 కి.మీ. దూరం నుంచే మోటార్ల ఆన్ – ఆఫ్‌నకు అవకాశం ●ఖమ్మం వాసి శ్రీనివాస్ సృజనకు ప్రశంసలు
ఖమ్మంవ్యవసాయం: కృషి, పట్టుదలకు తోడు అవసరమైన వారికి అండగా నిలవాలనే తపన ఉంటే పెద్ద చదువులేమీ అవసరం లేదని వెల్లే శ్రీనివాస్ నిరూపించారు. ఇంటర్‌లో ఒకేషనల్ కోర్సు పూర్తిచేసిన ఆయన రైతులకు ప్రయోజనం కలిగేలా వ్యవసాయ మోటార్ల ఆన్ – ఆఫ్ రిమోట్‌ను రూపొందించి పలువురి మన్ననలు అందుకున్నారు. ఖమ్మం మామిళ్లగూడెంలో నివాసముంటున్న శ్రీనివాస్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం కాగా, రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఎస్సెస్సీ తర్వాత ఇంటర్‌లో ఆర్ అండ్ టీవీ ఒకేషనల్ కోర్సు చేశారు. ఆ తర్వాత టీవీ మెకానిజంలో శిక్షణ పొంది ఆ రంగంలో కొనసాగుతూనే వ్యవసాయం చేశాడు. ఈ క్రమంలోనే మోటార్లతో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన శ్రీనివాస్.. మోటార్ల నిర్వహణకు రిమోట్ రూపొందించారు.
రైతు ప్రయోజనాల కోసం..
వ్యవసాయ మోటార్ల ఆన్, ఆఫ్ వ్యవస్థను రెండు కి.మీ. దూరం నుంచే ఆపరేట్ చేసేలా రిమోట్‌ను శ్రీనివాస్ రూపొందించారు. తద్వారా వర్షం, ఉరుముల సమయాన నేరుగా వెళ్లే బాధ తప్పడంతో ప్రమాదాలు తగ్గనున్నాయి. అంతేకాక ప్రతీసారి పొలం వద్దకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ మేరకు శ్రీనివాస్ రూపొందించిన ‘కిసాన్ రిమోట్’ను 2022లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బెస్ట్ ఇన్నోవేటర్‌గా అవార్డు అందించింది. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏపీకి చెందిన ఆచార్య ఎంజీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సైతం ఆయనకు గుర్తింపు నిచ్చాయి. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూ.3 లక్షలు ఆర్థికసాయం అందజేశారు. దీనికి తోడు పల్లె సృజన స్వచ్ఛంద సంస్థ ప్రోత్సహించింది. గత వారం హైదరాబాద్ శంకర్‌పల్లిలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్, పల్లె సృజన, గ్రామ భారతి సంస్థల ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్‌ను గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ సన్మానించగా, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గుజరాత్ విభాగం తరఫున ఆర్థిక సాయం అందజేశారు.
3,500 మంది వినియోగం
కిసాన్ రిమోట్‌ను ప్రస్తుతం 3,500 మంది రైతులు వినియోగించుకుంటున్నారని శ్రీనివాస్ తెలిపారు. ఇందులో తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ రైతులు ఉన్నారని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహంతో కిసాన్ రిమోట్లు తయారు చేస్తున్నానని తెలిపారు.
రైతుకు చేయూత.. కిసాన్ రిమోట్


