భూభారతిపై సంపూర్ణ అవగాహన
ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ
ఖమ్మంసహకారనగర్: రాష్ట్రప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన భూభారతి చట్టంపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి బుధవారం ఆమె రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ భూహక్కుల భద్రత, సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ చట్టంపై తహసీల్దార్లు అవగాహన కలిగి ఉండి, మండల, గ్రామ స్థాయి ఉద్యోగులకు వివరిస్తూనే సదస్సుల్లో రైతులకు వివరించాలని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేలకొండపల్లి మండలంతో పాటు ఇతరమండల కేంద్రాల్లోనూ గురువారం నుంచి అవగాహన సదస్సుల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించారు. అలాగే, తహసీల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేసి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు. అనంతరం చట్టంలోని పలు అంశాలపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, ఎస్‌డీసీ ఎం.రాజేశ్వరి, ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్‌గౌడ్, కలెక్టరేట్ ఏఓ అరుణ తదితరులు పాల్గొన్నారు.


