ఆ ఆస్పత్రులు సీజ్ చేయండి
● జిల్లాలోని పది ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆదేశం ● సీఎంఆర్‌ఎఫ్ గోల్‌మాల్ తేలడంతో డీహెచ్ ఉత్తర్వులు
ఖమ్మంవైద్యవిభాగం: చికిత్స చేయించుకోకున్నా నకిలీ బిల్లులు సృష్టించి ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) నిధులు కాజేసిన వ్యవహారంలో జిల్లాలోని పది ఆస్పత్రులపై ఉన్నతాధికారులు కొరఢా ఝుళిపించారు. ఇప్పటికే అక్రమాలు బయటపడిన పది ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేయాలని హెల్త్ డైరెక్టర్ నుండి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఆదేశాలు జారీ అయ్యాయి.
ఏమిటీ అక్రమాలు?
అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే ప్రజాప్రతినిధుల సిఫారసుతో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా నిధులు విడుదల చేస్తారు. అయితే ఈ నిధులను అక్రమ మార్గంలో కాజేయాలని ఖమ్మంలోని కొందరు ఆస్పత్రుల నిర్వాహకులు ప్రణాళిక వేశారు. ఇందులో భాగంగా చికిత్స చేయించుకోని వారి పేర్లతో నకిలీ మెడికల్ బిల్లులు సృష్టించి సమర్పించగా.. విషయం తెలియని ప్రజాప్రతినిధులు సిఫారసు చేశారు. దీంతో విడుదలైన రూ.లక్షల్లో నగదును ఆస్పత్రుల నిర్వాహకులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై కొద్దినెలల క్రితం సీఎంఓ ద్వారా అందిన ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మంలోని ఆస్పత్రుల్లోనూ హైదరాబాద్ అధికారులు అప్పట్లో విచారణ చేశారు. ఈక్రమాన ఆస్పత్రుల్లో నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్‌ఎఫ్ నిధులు కాజేసినట్లు తేలగా హెల్త్ డైరెక్టర్‌కు నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఖమ్మం నెహ్రూ నగర్‌లోని శ్రీ వినాయక ఆస్పత్రి, గ్లోబల్ ఆస్పత్రి, జేఆర్.ప్రసాద్ ఆస్పత్రి, శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాయి మల్టీ స్పెషాలిటీ, వైష్ణవి ఆస్పత్రి, సుజాత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, న్యూ అమృత ఆస్పత్రితో పాటు మేఘాశ్రీ హాస్పిటల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఆదేశాలు అందాయి.
ఔను నిజమే...
ఖమ్మంలోని పది ఆస్పత్రల గుర్తింపు రద్దు చేయాలన్న ఆదేశాలపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ కళావతి బాయిని వివరణ కోరగా వాస్తవమేనని ధ్రువీకరించారు. విజిలెన్స్ అధికారుల నివేదిక ప్రకారం హెల్త్ డైరెక్టర్ ఆయా ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేయాల ని ఆదేశాలు అందాయని తెలిపారు. ఈమేరకు ఆస్పత్రుల యాజమాన్యాలకు ఉత్తర్వుల కాపీలు పంపించి, మూసివేయాలని సూచించినట్లు వెల్లడించారు.


