నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం ఖమ్మం కార్పొరేషన్ పరిధి 16వ డివిజన్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక శనివారం ఉదయం రఘునాథపాలెం మండలం మంచుకొండలో రైతుబజార్ నిర్మాణానికి, ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత బూడిదంపాడులో బీటీ రోడ్డు నిర్మాణం, మెయిన్‌రోడ్డు విస్తరణ, ఎస్సీ కాలనీలో అంతర్గత రోడ్లు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు.
ఖమ్మం మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు
ఖమ్మంవ్యవసాయం: గుడ్ ఫ్రైడే, వారాంతం నేపథ్యాన శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. ఈమేరకు శుక్రవారం గుడ్ ఫ్రైడే, శని, ఆది వారాంతపు సెలవులు ఉంటాయని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్‌లో లావాదేవీలు మొదలవుతాయనే విషయాన్ని రైతులు గమనించాలని ఆయన కోరారు.
ఏసీ బస్సులను సద్వినియోగం చేసుకోండి
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి నుంచి హైదరాబాద్‌కు ఆరు రాజధాని ఏసీ బస్సులు నడిపిస్తున్న నేపథ్యాన ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరాం సూచించారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపోను గురువారం తనిఖీ చేసిన ఆయన గ్యారేజీ, ఇతర విభాగాల్లో పరిశీలించడమే కాక టైర్ల నాణ్యతపై సూచనలు చేశారు. సత్తుపల్లి నుంచి హైదరాబాద్‌కు పగలు, రాత్రి మూడు చొప్పున ఆరు ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా, మహిళా సమాఖ్యల ద్వారా ఖమ్మం రీజియన్‌కు 21 పల్లెవెలుగు బస్సులు వచ్చాయని ఆర్‌ఎం చెప్పారు. అనంతరం బస్టాండ్‌ను పరిశీలించే క్రమాన ప్రయాణికులు ఎండలో ఉండడంతో, వారంలోగా అదనపు ప్లాట్‌ఫామ్ ఏర్పాటుచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. ఆతర్వాత బస్టాండ్‌లో శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యాన ఉచిత మజ్జిగ పంపిణీని ఆర్‌ఎం ప్రారంభించారు. డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి, సీఐ విజయశ్రీ, ఎంఎఫ్ ఎస్.సాహితి, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
ఖమ్మంవ్యవసాయం: రానున్న వానాకాలం సీజన్‌లో సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(డీఏఓ) ధనసరి పుల్లయ్య సూచించారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన విత్తనాలు, ఎరువుల డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది డిమాండ్ ఆధారంగా పత్తి, మిరప, ఇతర వాణిజ్య పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలని, కొరత ఏర్పడకుండా ముందుగానే కంపెనీలతో చర్చించాలని తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించాలని యత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఖమ్మం డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వరరావు, ఏడీఏలు శ్రీనివాసరెడ్డి, వాసవీరాణి, సరిత, ఏఓలు కిషోర్‌బాబు, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం రైతులకు
రూ.3 కోట్ల చెల్లింపులు
నేలకొండపల్లి: జిల్లాలో 350 కేంద్రాల నుంచి ఇప్పటి వరకు 6,481 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి కె.చందన్‌కుమార్ తెలిపారు. మండలంలోని రాజేశ్వరపురం రైస్ మిల్లును గురువారం తనిఖీ చేసిన ఆయన నిల్వలను పరిశీలించాక మాట్లాడారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా, రైతులకు రూ.3కోట్ల మేర నగదు జమ చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపడుతూనే ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. మిల్లర్లు ఇబ్బంది పెట్టకుండా పర్యవేక్షిస్తున్నామని, రైతులకు సమస్య ఎదురై తే ఫిర్యాదు చేయాలని సూచించారు. సివిల్ సప్లయీస్ ఆర్‌ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన


