ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్ట్
ఖమ్మంక్రైం: ఓ వ్యక్తి అకౌంట్ నుంచి నగదు కాజేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఖమ్మానికి చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.11.49 లక్షల నగదు తనకు తెలియకుండానే విత్‌డ్రా అయ్యాయని మార్చి 22న ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లె మండలం కొజ్జగూడెంలో వాటర్‌ప్లాంట్ నిర్వహిస్తున్న పసులాది మల్లేశ్‌గౌడ్ ఖాతాలో నగదు జమ అయినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గద్దె రాజుతోపాటు మరికొందరితో కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకోగా, మల్లేశ్, రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సైబర్ క్రైమ్ డీఎస్పీ సీహెచ్‌ఆర్‌వీ ఫణీందర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐలు జి.రంజిత్‌కుమార్, ఎం.విజయ్‌కుమార్, కానిస్టేబుళ్లు వై.వీ.కృష్ణారావు, టి.కిషన్‌రావు, ఎం.నాగేశ్వరరావును సీపీ సునీల్‌దత్ అభినందించారు.


