ఎవరి పని వారిదే !
వైరా: వైరా నుంచి సోమవరం వరకు నాలుగు లేన్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రూ.12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రోడ్డు పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే రోడ్డు మధ్యలో మిషన్ భగీరథ పైప్‌లైన్ ఉండగా.. ఎయిర్‌వాల్వ్‌ను అలాగే వదిలేసి పనులు చేపడుతున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక మధ్యలో ఉండే ఈ వాల్వ్ ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశముంది. పైప్‌లైన్‌ను రోడ్డు పక్కకు పొడిగించి అక్కడ వాల్వ్ ఏర్పాటుచేసే అవకాశం ఉన్నా అటు ఆర్‌అండ్‌బీ, ఇటు భగీరథ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇకపై ప్రతీరోజు
పశు వైద్యసేవలు
ఎర్రుపాలెం: రైతులు తమ పశువులకు వైద్యం చేయించేలా ప్రభుత్వ వైద్యశాలలను సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనారయణ సూచించారు. మండలంలోని లక్ష్మీపురంలోని పశు వైద్యశాల ఎల్‌ఎస్‌ఏగా ఎస్.రమేష్‌ను కేటాయించగా శుక్రవారం ఆయన విధుల్లో చేరారు. ఈసందర్భంగా ఆస్పత్రిని తనిఖీ చేసిన జేడీ మందుల లభ్యతపై ఆరా తీశాక మాట్లాడారు. కొన్నాళ్లుగా ఆస్పత్రికి సిబ్బంది లేరని, ఇకపై పూర్తిస్థాయిలో ప్రతిరోజూ పశువులకు వైద్యం అందుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో తల్లపురెడ్డి ప్రవల్లిక, తల్లపురెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరస్వామి
ఆలయంలో ప్రత్యేక పూజలు
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ద్వారకాపురి కాలనీ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించి నలభై రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ బాధ్యులు ద్రోణంరాజు మల్లికార్జునశర్మ, రాగాల చంద్రారెడ్డి, దురిశెట్టి శ్రీనివాసరావు, నారాయణ, గాదె నాగు, విష్ణు, రమేష్, తిరుపతిరావు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ
వైరారూరల్: వైరా మండలం అష్ణగుర్తిలో రామాలయం పక్కన అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుక్రవారం గ్రామస్తులు భూమి పూజ చేశారు. దాతలు, ఆంజనేయ స్వామి భక్త బృందం బాధ్యులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శు క్ర వారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం గావించారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం, కుంకుమ పూజలు, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
22, 25 తేదీల్లో
టీబీజీకేఎస్ నిరసనలు
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న సింగరేణివ్యాప్తంగా గనులు, డిపార్ట్‌మెంట్ వద్ద, 25న జీఎం కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టి, వినతిపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు.
ఎవరి పని వారిదే !
ఎవరి పని వారిదే !


