గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Apr 20 2025 12:59 AM | Updated on Apr 20 2025 12:59 AM

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఎర్రుపాలెం: మండలంలోని నర్సింహాపురంలో గుర్తు తెలియని వ్యక్తి(40) మృతి చెందాడు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా, స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నలుపు రంగు కాటన్‌ ప్యాంట్‌ ధరించి చేతికి వాచీ ఉన్న మృతుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ పి.వెంకటేష్‌ సూచించారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి..

కూసుమంచి: కూసుమంచిలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మండలంలోని పోచారానికి చెందిన నందిగాం శ్రీనివాసరెడ్డి(54) బైక్‌పై కూసుమంచి నుండి ఇంటికి వెళ్తుండగా మరో ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్‌ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి..

ఖమ్మంరూరల్‌: మండలంలోని ఎం.వెంకటాయపాలెంలో శనివారం చేపలు పట్టడానికి వెళ్లిన చెక్కల గురువయ్య(45) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. మహబూబాబాద్‌ జిల్లా సీరోలుకు చెందిన గురవయ్య ఈనెల 15న గ్రానైట్‌ ఫ్యాక్టరీలో పనికి వచ్చాడు. ఆతర్వాత ఎం.వెంకటాయపాలెం గ్రామస్తులైన తేనె సూరిబాబు, ఎస్‌.కే.పాషాతో కలిసి గ్రామ చెరువులో బోట్‌ సాయంతో చేపల వేట కొనసాగించారు. తిరిగి వస్తుండగా బోట్‌లో కళ్లు తిరగగా గురువయ్య చెరువులో పడడంతో ఆయన సహచరులు బయటకు తీసి ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

ట్రాక్టర్‌ ఢీకొనడంతో వాహనదారుడు..

రఘునాథపాలెం: మండలంలోని వేపకుంట్ల వద్ద ట్రాక్టర్‌ ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఖమ్మం బాలపేటకు చెందిన ధరావత్‌ సుధాకర్‌(39) కొన్నేళ్లుగా కొణిజర్ల మండలం అన్నారంలో నివాసముంటున్నాడు. కూలీ పనుల కోసం బాలపేటకు వాహనంపై వెళ్తుండగా వేపకుంట్ల శివార్లలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయన భార్య సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు.

బాలుర తల్లిదండ్రులకు జరిమానా

ఖమ్మంక్రైం: ఎనిమిది మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడగా, వారి తల్లిదండ్రులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం నాలుగో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌(స్పెషల్‌ మొబైల్‌) బి.నాగలక్ష్మి తీర్పు వెలువరించారు. మైనర్‌ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో ఎనిమిది మంది పట్టుబడ్డారని ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. వీరి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించారని చెప్పారు. అలాగే, మద్యం తాగి వాహనం నడిపిన మరో వ్యక్తికి రూ.2వేల జరిమానా విధించినట్లు తెలిపారు.

పాఠశాలలో కంప్యూటర్‌, సామగ్రి చోరీ

కొణిజర్ల: మండలంలోని పల్లిపాడు ప్రభుత్వ పాఠశాలలో చోరీ జరిగింది. పాఠశాల హెచ్‌ఎం కోట సుజాత, ఉద్యోగులు శనివారం ఉదయం వచ్చేసరికి కంప్యూటర్‌ గది తాళం పగలగొట్టి ఉంది. ఈమేరకు రూ.1.83లక్షల విలువైన రెండు కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన ఆరు బ్యాటరీలు, కంప్యూటర్‌, ప్రింటర్‌తో పాటు మైక్‌ సెట్‌ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దుండగులు శుక్రవారం రాత్రి చోరీ చేసి ఉంటారని హెచ్‌ఎం ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్‌ఐ సూరజ్‌, సిబ్బంది పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

కుక్కల దాడిలో దుప్పికి గాయాలు

సత్తుపల్లిరూరల్‌: వీధికుక్కల దాడిలో చుక్కల దుప్పి గాయపడింది. సత్తుపల్లి మండలం గౌరిగూడెంలోని ఓ ఆయిల్‌పామ్‌ తోటలోకి శనివారం దుప్పి వచ్చింది. దీన్ని గుర్తించిన వీధి కుక్కలు వెంబడించి గాయపర్చడంతో స్థానికులు కుక్కలను తరిమివేశారు. ఆపై అటవీ శాఖ ఎఫ్‌ఎస్‌ఓ నర్సింహా, బీట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావుకు దుప్పిని అప్పగించగా వారు ఆస్పత్రిలో దుప్పికి చికిత్స చేయించాక సత్తుపల్లి నీలాద్రి అర్బన్‌పార్క్‌లో వదిలివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement