రైతాంగాన్ని ఆదుకోవాలి
ఖమ్మంమయూరిసెంటర్: అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం పంటనష్టాన్ని వేయించడమే కాక ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలని, తడిసిన పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రంగారావు డిమాండ్ చేశారు.
నేడు, రేపు ఎమ్మెల్సీ
కవిత పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆది, సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మంలోని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసానికి చేరుకోనున్న ఆమె బీఆర్‌ఎస్ నాయకుడు గుండాల కృష్ణను పరామర్శిస్తారు. ఆతర్వాత ఖమ్మం, కల్లూరు మండలం లింగాలలో జరిగే కార్యక్రమాలకు కవిత హాజరవుతారు. సోమవారం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నాక అక్కడి హరిత హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.
ఇసుకాసురులపై చర్యలు
బోనకల్: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పున్నంచందర్ హెచ్చరించారు. ‘యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఇసుక వాహనాల రాకపోకలతో దెబ్బ తిన్న పొలం, రోడ్డును పరిశీలించి బాధిత రైతుతో మాట్లాడారు. ఏపీ నుంచి రాత్రివేళ అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా చెక్‌పోస్టు ఏర్పాటుచేస్తామని తెలిపారు. తహసీల్దార్ వెంట గిర్దావర్ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
పది ఆస్పత్రుల
రిజిస్ట్రేషన్ రద్దు
ఖమ్మంవైద్యవిభాగం: తప్పుడు బిల్లులతో ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా లబ్ధి పొందిన ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి ఒక ప్రకటనలో తెలిపారు. చికిత్స చేయించుకోని వారి పేర్లతో నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్‌ఎఫ్ నిధులు కాజేసినట్లు తేలడంతో పది ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దుచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈమేరకు ఖమ్మంలోని శ్రీ వినాయక హాస్పిటల్, శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, మేఘశ్రీ హాస్పిటల్, జే.ఆర్.ప్రసాద్ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.
డెయిరీ లబ్ధిదారులకు వచ్చే నెలలో గేదెలు
మధిర: ఇందిరా మహిళా డెయిరీలో సభ్యత్వం తీసుకున్న మహిళలకు వచ్చే నెలలో గేదెలు అందిస్తామని డీఆర్‌డీఓ సన్యాసయ్య తెలి పారు. మండలంలోని వంగవీడులో మహిళా సంఘాల సభ్యులకు శనివారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సభ్యులు వారికి నచ్చిన చోట గేదెలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. ఐదు మండలాల్లో 4వేల మంది సభ్యత్వాలు తీసుకోగా, ఒక్కొక్కరికి రూ.2 లక్షల విలువైన రెండు పాడిగేదెలు అందజేయనున్నట్లు తెలి పారు. ఇందులో 80శాతం సబ్సిడీ ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో డీపీఎం శ్రీనివాసరావు, ఏపీఎంలు జంగం లక్ష్మణరావు, శ్రీనివాసరావు, మార్కెట్ వైస్ చైర్మన్ అయిలూరి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
వైకుంఠధామంలో
ఆత్మహత్య
నేలకొండపల్లి: మండలంలోని నాచేపల్లికి చెందిన భూక్యా మల్సూర్(26) గ్రామ వైకుంఠధామంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆరేళ్ల క్రితం వివాహం జరగగా, రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నాడు. ఈక్రమంలోనే జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఘటనపై మల్సూర్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
చోరీ కేసుల్లో
పాత నేరస్తుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: ఖమ్మం ముస్తఫానగర్, శుక్రవారపుపేటలో కొద్దినెలల క్రితం చోరీలు జరగగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. చోరీ జరి గిన ఇళ్లలో లభించిన వేలిముద్రల ఆధారంగా విచారణ చేపట్టగా, ధంసలాపురం అగ్రహారానికి చెందిన పాత నేరస్తుడు మతిన్‌ను నిందితుడిగా గుర్తించి శనివారం అరెస్ట్ చేశామని ఖమ్మం వన్‌టౌన్ సీఐ ఉదయ్‌కుమార్ తెలిపారు. ఆయన నుంచి మూడు తులాల బంగారం, 300 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.
రైతాంగాన్ని ఆదుకోవాలి


