తక్షణ పరిష్కారానికే భూభారతి
కూసుమంచి/తిరుమలాయపాలెం: రాష్ట్రప్రభుత్వం భూములకు సంబంధించి సమస్యల తక్షణ పరిష్కారానికే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ తెలిపారు. మండలంలోని పాలేరులో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కొత్త చట్టంతో పెండింగ్ ఉన్న సమస్యలకు మోక్షం కలగనుండగా, హక్కులు పొందడం, సవరణలకు అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే, భూధార్ కార్డులు జారీ చేయడమే కాక ఉచిత న్యాయసాయం అందిస్తామన్నారు. అలాగే, తిరుమలాయపాలెంలో నిర్వహించిన సదస్సులో కూడా ఇన్‌చార్జ్ కలెక్టర్ శ్రీజ మాట్లాడారు. భూభారతి చట్టం ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదాబైనామాల రిజిస్ట్రేషన్ తీరును వివరించారు. కాగా, సుబ్లేడు గ్రామానికి చెందిన ఎస్.డీ.జియావుద్దీన్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం, భూముల కబ్జాపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఇన్‌చార్జ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఆమె.. అందరు అధికారులను తప్పుపట్టలేమని అంకితభావంతో పనిచేసే వారు కూడా ఉన్నారని.. కొత్త చట్టం అమలులో అధికారులకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సదస్సుల్లో నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్లు కరుణశ్రీ, సుధీర్, ఎంపీడీఓలు వేణుగోపాల్‌రెడ్డి, సిలార్ సాహెబ్, ఏడీఏ సరిత, ఏఓలు వాణి సీతారాంరెడ్డి, మద్దులపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చావా వేణు తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ


