జర భద్రం..
● వేసవి సెలవుల్లో తాళం వేసి ఊరెళ్తున్నారా..? ● తప్పక ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. ● పోలీస్ గస్తీ ముమ్మరం
ఖమ్మంక్రైం: పాఠశాలలు, కళాశాలలు అన్పింటికీ దాదాపుగా నేడో, రేపో వేసవి సెలవులు ప్రకటించనున్నారు. ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. రెండు నెలల పాటు సెలవులు ఉండటంతో ముందుగానే పిల్లలతో కలిసి కుటుంబ సబ్యులందరూ పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకునే ఉంటారు. దీనికితోడు వివాహాలు కూడా ఉండటంతో బంధువులింటికి వెళ్లేందుకు సిద్ధమయ్యే ఉంటారు. అయితే, దొంగల నుంచి తమ సొత్తును రక్షించుకునేందుకు ఇంటికి తాళం వేసి ఊరెళ్లేవారు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. లేదంటే అంతే సంగతులు. తిరిగి వచ్చేసరికి ఖాళీ చేసి పెడతారు దొంగలు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అంతర్‌రాష్ట్ర, అంతర్ జిల్లా దొంగల సంచారం ఉండటంతో తాళం వేసి ఊర్లు వెళ్లే వారు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందేనని పోలీస్ శాఖ చెబుతోంది.
● ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్‌లో భద్ర పరుచుకోవాలి. లేదంటే తమకు తెలిసిన సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలి.
● ఇంటి బీరువా తాళాలను తమ వెంట తీసుకొని వెళ్లాలి. విలువైన వస్తువులు, వ్యక్తిగత విషయాలు(తమ వద్ద ఉన్న డబ్బు, నగలు గురించి) ఇతరులతో పంచుకోకూడదు.
● బయట గేట్‌కు తాళం వేయకుండా లోపలి నుంచి గొళ్లెం పెట్టాలి. ఇంటి లోపల, ముఖ్యంగా వరండాలో లైట్లు వేసి ఉంచాలి.
● అపార్ట్‌మెంట్లలో సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అవి పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలి. పగలు, రాత్రి సమయాల్లో కూడా వాచ్‌మెన్‌లు ఉండేలా చూసుకోవాలి. వృద్ధులు, దివ్యాంగులను ఒంటరిగా ఇళ్లల్లో ఉంచి పోకూడదు.
● ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లే ముందు చుట్టు పక్కల వారికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. ముఖ్యంగా శివారుకాలనీలు, అపార్ట్‌మెంట్ల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే పోలీసులు, లేదా డయల్–100కు సమాచారం ఇవ్వాలి.
పోలీస్ పెట్రోలింగ్ పెంచాం
వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండటంతో జిల్లావ్యాప్తంగా పోలీస్ పెట్రోలింగ్ విస్తృతంగా పెంచాం. ప్రత్యేక బృందాలతో రాత్రి వేలళ్లో గస్తీ ముమ్మరం చేయాలని జిల్లా పోలీస్ అధికారులను ఇప్పటికే ఆదేశించాం. తాళాలు వేసి ఊర్లకు వెళ్లే ప్రజలు ఇంటి పక్కవారికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచి వెళ్లొద్దు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానంగా ఎవరైనా సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆరుబయట నిద్రించేవారు ఇంటి చుట్టూ తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండాలి. నగలు ధరించకూడదు.
సునీల్‌దత్, సీపీ, ఖమ్మం
జర భద్రం..


