ఎప్‌సెట్ ఉచిత శిక్షణ
● కోచింగ్ తీసుకుంటున్న 100 మంది విద్యార్థులు ● బాల, బాలికలకు వేర్వేరుగా శిక్షణ ● పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం
ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లోనూ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది. ఈ క్రమంలో విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను సైతం ఉచితంగా అందిస్తోంది. నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బాలురకు, అంబేడ్కర్ గురుకుల కళాశాలలో బాలికలకు ఉచితంగా ఎప్‌సెట్ కోచింగ్‌ను అందిస్తున్నారు. 100 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా.. వీటి పరిధిలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 468 మంది, బైపీసీ 283 మంది విద్యార్థులున్నారు. అందులో ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఎప్‌సెట్ కోచింగ్ ఇస్తున్నారు.
వేర్వేరుగా శిక్షణ
విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేసవి కాలం కావడంతో మంచినీటితోపాటు మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యార్థినులకు నగరంలోని అంబేడ్కర్ గురుకుల కళాశాల, బాలురకు నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శిక్షణ ఇస్తుండగా.. వీరంతా ఆయా కళాశాలల పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు శిక్షణ ఉంటోది. ఆ తర్వాత స్టడీ అవర్స్ ఉంటాయి. శిక్షణలో విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.
అదనపు కలెక్టర్ పర్యవేక్షణ
జిల్లాలో విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్రీజ ఎప్‌సెట్ కోచింగ్ కేంద్రాలను సందర్శిస్తూ వారికి సూచనలు చేస్తున్నారు. ఉన్నత విద్య వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేస్తూ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు, గురుకులాలకు సంబంధించిన అధ్యాపకులు బోధిస్తున్నారు. అలాగే ఒకరిద్దరు ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులను కూడా నియమిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా ఎప్‌సెట్ కోచింగ్ ఇస్తున్నాం. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచనలతో ఈ శిక్షణ అందిస్తున్నాం. ఇతర సెంటర్లలో కోచింగ్ తీసుకోలేని విద్యార్థులకు ఇది మంచి అవకాశం. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఈ కోచింగ్ ద్వారా మంచి ర్యాంక్ సాధించి ఇంజనీరింగ్ సీట్లు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. జీవితంలో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఇలాంటి శిక్షణ ఉపయోగపడుతుంది.
కె.రవిబాబు,
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, ఖమ్మం
శిక్షణలో ఎన్నో నేర్చుకుంటున్నాం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత శిక్షణను ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం అభినందనీయం. మాకున్న సందేహాలు ఎప్‌సెట్ కోచింగ్ ద్వారా నివృత్తి చేసుకుంటున్నాం. శిక్షణలో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. ప్రవేశ పరీక్షలపై ఉన్న భయం తొలగిపోయింది. అధ్యాపకులు సైతం మాకు ఎన్నో అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని, ప్రవేశ పరీక్షల్లో రాణిస్తాం.
ఎస్.భానుతేజ, ఎంపీసీ,
బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
ఎప్‌సెట్ ఉచిత శిక్షణ
ఎప్‌సెట్ ఉచిత శిక్షణ


