నేడు, రేపు కార్యదర్శులకు శిక్షణ
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో ఎంపిక చేసిన 35 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఈ నెల 22, 23వ తేదీల్లో ఆర్‌టీఏ చట్టంపై శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్వో, ఎంసీహెచ్‌ఆర్‌డీ ఇన్‌చార్జ్ మేనేజర్ పద్మశ్రీ తెలిపారు. తొలి విడతగా 35 మందిని ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో శిక్షణ మొదలవుతుందని తెలిపారు. కాగా, మిగతా కార్యదర్శులకు సైతం విడతల వారీగా శిక్షణ ఉంటుందని డీఆర్వో వెల్లడించారు.
లైన్ ఇన్‌స్పెక్టర్‌కు ప్రమాదం
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం, పిండిప్రోలు సబ్‌స్టేషన్ల లైన్ ఇన్‌స్పెక్టర్ గడికొప్పుల రాములు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈదురుగాలులు, అకాల వర్షంతో ఆదివారం రాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఎదురవగా, సమస్యను పరిష్కరించేందుకు ఆయన కారులో వెళ్తున్నారు. ఈక్రమాన తిరుమలాయపాలెం వద్ద ప్రధాన రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు విద్యుత్ స్తంభాలకు ఢీకొని బోల్తా పడింది. రాములు గాయపడగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
విద్యుదాఘాతంతో
రెండు ఆవులు మృతి
కామేపల్లి: విద్యుత్ షాక్ కారణంగా రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. మండలంలోని గోవింద్రాలకు చెందిన రైతులు లకావత్ శ్రీను, బానోత్ నాగ తమ పశువులను సోమవారం మేతకు విడిచారు. అయితే, ఆదివారం రాత్రి ఈదురుగాలులతో తెగిపడిన తీగలను తాకిన ఆవులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. ఈ మేరకు అధికారులు తమకు పరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరారు.


