నీరు పారేదాక పని ఆగొద్దు
ఖమ్మంఅర్బన్: రఘునాథపాలెం మండలంలోని సాగు భూములకు సాగర్ జలాలు అందించాలనే లక్ష్యంతో మంచుకొండ వద్ద ప్రధాన కాల్వపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.65 కోట్ల అంచనాలతో నిర్మించే ఈ పథకం పనులు త్వరగా పూర్తిచేసి ట్రయల్ రన్ నిర్వహించాలనే లక్ష్యంతో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రాత్రింబవళ్లు చేపడుతున్నారు. ఈ సీజన్‌లోనే మండలంలోని చెరువులకు సాగర్ జలాలు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడమే కాక, పనుల్లో వేగం పెరిగేలా తరచూ సమీక్షిస్తున్నారు. అయితే ప్రధాన పైప్‌లైన్, పంపుహౌస్, ఇతర పనులు చివరి దశకుచేరినా మోటార్లు ఇప్పటికిప్పుడు సమకూర్చడం సాధ్యం కాదని కంపెనీ బాధ్యులు చెప్పినట్లు తెలిసింది. దీంతో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అదనంగా ఉన్న మోటార్లను రెండు రోజుల క్రితం తెప్పించగా వీటిని బిగించే పనులు సోమవారం మొదలయ్యాయి. ఈనెల 24 లేదా ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లో సాగర్ జలాల ఎత్తిపోతల ట్రయల్ రన్ చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు.
ఫ్లడ్‌లైట్ల వెలుగులో
మంచుకొండ ‘లిఫ్ట్’ పనులు
నీరు పారేదాక పని ఆగొద్దు


