‘భూ భారతి’తో సమస్యలకు చెక్
రఘునాథపాలెం: రాష్ట్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో భూసంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. రఘునాథపాలెం రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, భూమి హద్దుల నిర్దారణ, యాజమాన్య హక్కుల నిర్ణయం సులువవుతుందని చెప్పారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, హక్కుదారులకు పట్టాల మంజూరు, నిషేధిత భూముల పరిశీలన చేపడుతామని తెలిపారు. ఆర్డీఓ జి.నర్సింహారావు, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ అశోక్‌కుమార్, ఏఓ ఉమామహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. కాగా, సర్వే ద్వారా కౌలు రైతులకు రక్షణ చట్టం అమలు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎస్.నవీన్‌రెడ్డి తదితరులు కలెక్టర్‌కు విన్నవించారు.
●ముదిగొండ: ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపడుతూనే కాంటా కాగానే మిల్లులకు తరలించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆదేశించారు. ముదిగొండ మండలం మేడేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడాక నిర్వాహకులకు సూచనలు చేశారు. తేమ, తరుగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులకు టార్పాలిన్లు, గన్నీబ్యాగ్‌లు సమకూర్చాలని చెప్పారు. తొలుత కేంద్రం వద్దకు చేరడానికి కలెక్టర్ బైక్‌పై వెళ్లారు. తహసీల్దార్ సునీత ఎలిజబెత్ పాల్గొన్నారు.
●ఖమ్మంవ్యవసాయం: మధిర నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తున్న ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా అధిక పాల దిగుబడి ఇచ్చే గేదెలనే పంపిణీ చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో డెయిరీ, సదరం క్యాంపులు, వితంతు పెన్షన్లపై అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల బీసీలు విజయలక్ష్మి, జ్యోతి, డీపీఓ ఆశాలత, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబు, ఆర్డీవో రాజేందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అవగాహన సదస్సులో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్


