యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా సాయికుమార్
ఎర్రుపాలెం: యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎర్రుపాలెం మండలం కండ్రికకు చెందిన వేజండ్ల సాయికుమార్ ఎన్నికయ్యారు. ఈమేరకు మంగళవారం ప్రకటన విడుదలైంది. నాలుగు నెలల క్రితం ఆన్‌లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహించగా, సాయికుమార్‌కు 16వేల మేరకు ఓట్లు పోలయ్యాయి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, నాయకుల సమన్వయంతో యూత్ కాంగ్రెస్‌తో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
గ్రానైట్ ఫ్యాక్టరీ కార్మికుడి బలవన్మరణం
తిరుమలాయపాలెం: గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసోం రాష్ట్రంలోని నాగోల్ జిల్లా లాల్‌మట్టికి చెందిన రాజుబాసు మాటరి(19) కొక్కిరేణి సమీపాన గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఫోన్ పగులగొట్టిన ఆయన ఆందోళనకు గురయ్యాడు. ఈక్రమంలోనే ఫ్యాక్టరీ సమీపాన చెట్టుకు సోమవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన సహచర కార్మికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మహిళ అదృశ్యం
దమ్మపేట: ఓ మహిళ కనిపించకుండా పోయిన ఘటన మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన గొర్రెముచ్చు శిరీష (26).. తన భర్త చనిపోవడంతో మండలంలోని మొద్దులగూడెంలోని పుట్టింట్లో ఉంటోంది. గతేడాది నవంబర్ 16న ఇంటి నుంచి సొంత పని మీద బయటకు వెళ్లిన శిరీష ఇప్పటివరకు తిరిగి రాలేదు. తల్లితండ్రులు పలుచోట్ల వెతకగా ఆచూకీ లభించలేదు. శిరీష తల్లి నిర్మల మంగళవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.
ప్రమాదంలో
ట్రాక్టర్ డ్రైవర్ మృతి
ఖమ్మం రూరల్: మండలంలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి చిన్న వెంకటగిరి వాసి మంగళవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పి.వీరబాబు(38) యజమాని సూచనలతో మిర్యాలగూడ వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దీంతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో వీరబాబు మృతదేహంతో యజమాని ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈమేరకు యజమాని మలపూ కృష్ణ ఇంటికి తాళం వేసి వెళ్లిపోగా పోలీసులను ఆశ్రయించారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
చింతకాని: చింతకాని మండలం రామకృష్ణాపురం బస్టాండ్ వద్ద మంగళవారం చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముదిగొండ మండలం పెద్దమండవ మున్నేరు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు తేలడంతో సీజ్ చేశామని ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.


