తాగునీటికి ఇబ్బందులు రావొద్దు
ఖమ్మంమయూరిసెంటర్: వేసవిలో ఎక్కడ కూడా తాగునీటి ఇబ్బందులు ఎదురుకాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన వేసవిలో నీటి ఇక్కట్లు, ఇంకుడు గుంతల నిర్మాణంపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో సమీక్షించారు. మిషన్ భగీరథ గ్రిడ్, ఇంటింటికి తాగునీటి సరఫరా కోసం చేపట్టిన పనులు, ప్రస్తుతం సరఫరాలో, అవాంతరాలు, పెండింగ్ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై ఆరా తీశాక కలెక్టర్ మాట్లాడారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని, ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని తెలిపారు. అంతేకాక ప్రతీ వాణిజ్య భవనం, గృహాల్లో ఇంకుడుగుంతల తప్పక ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్‌కుమార్, డీఆర్‌డీఓ సన్యాసయ్య, మధిర, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్లు సంపత్‌కుమార్, ఏ.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్


