అండర్ బ్రిడ్జికి నిధులు కేటాయించండి
ఖమ్మంవన్‌టౌన్: ఖమ్మం ధంసలాపురం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి, సర్వీస్ రోడ్డుకు సర్వే పూర్తయినందున భూసేకరణ, నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన రైల్వే జనరల్ మేనేజర్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. నిధులు లేక బ్రిడ్జి, రోడ్డు నిర్మాణంలో జాప్యం జరుగుతుండగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈమేరకు నిధుల విడుదలపై జీఎం సానుకూలంగా స్పందించగా.. గతంలో రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్దరించాలని, డోర్నకల్ – కొత్తగూడెం మార్గంలోని గాంధీనగర్ స్టేషన్‌లో రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ఎంపీ కోరారు.
27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు
ఖమ్మంసహకారనగర్: తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి ఈనెల 27న పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఆదివారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు , 7నుంచి, 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీకేజీపై వదంతులను ఎవరూ నమ్మొద్దని, అలాంటి సమాచారం ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని డీఈఓ సూచించారు.
పాఠశాల అవసరాలకు రూ.3.50లక్షల వితరణ
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండల పరిషత్ పాఠశాలలో సౌకర్యాల కల్పన, అవసరాల కోసం సదాశివునిపేటకు చెందిన మందపాటి కరుణాకర్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య విజ యలక్ష్మి బుధవారం రూ.3.50 లక్షలు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల పేరిట ఈ నగదును ఫిక్స్ చేసి ఏటా వచ్చే రూ.25వేల వడ్డీని సౌకర్యాల కల్ప నకు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం విజయలక్ష్మిని హెచ్‌ఎం బుచ్చిబాబు సన్మానించగా, విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ తిరునగరి కుమారి, ఉపాధ్యాయులు సీహెచ్.నిరంజన్, ఎం.విక్రమ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నేటి నుంచి మామిడి మార్కెట్
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం రోటరీనగర్‌లోని వీధి వ్యాపారుల ప్రాంగణంలో గురువారం నుంచి మామిడి రైతుబజార్ మొదలవుతుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. రైతులు, వినియోగదారుల ప్రయోజనం కోసం ఈ రైతుబజార్‌ను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. సహజసిద్ధమైన పరిస్థితుల్లో పండించి, కార్బైడ్ రహితంగా మాగబెట్టిన మామిడి పండ్లనే మాత్రమే ఇక్కడ విక్రయిస్తారని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మధసూదన్ సూచించారు.
రైతులను ఇబ్బంది పెడితే మిల్లుల సీజ్
కల్లూరు: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా, తాలు, తేమ పేరిట జాప్యం చేస్తే మిల్లులు సీజ్ చేస్తామని పౌర సరఫరాల సంస్థ డీఎం శ్రీలత హెచ్చరించారు. కల్లూరులోని పలు రైస్ మిల్లులను ఆర్‌డీఓ ఎల్.రాజేందర్, తహసీల్దార్ పులి సాంబశివుడుతో కలిసి బుధవారం ఆమె తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారనే ఫిర్యాదులతో తనిఖీ చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ సరిపడా హమాలీలను నియమించుకుని ఎప్పటికప్పుడు ధాన్యం దిగుమతి చేసుకోవాలని స్పష్టం చేశారు. తొలుత మండలంలోని ఆమె పుల్లయ్యబంజర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
అండర్ బ్రిడ్జికి నిధులు కేటాయించండి
అండర్ బ్రిడ్జికి నిధులు కేటాయించండి


